మూవీ లవర్స్ కి పరిచయం అక్కర్లేని పేరు గుణశేఖర్. బాలనటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ని రామాయణంతో పరిచయం చేసిన ఘనత తనకే దక్కుతుంది. సొగసు చూడతరమా లాంటి న్యూ ఏజ్ రామ్ కామ్ తీయడం అప్పట్లోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందుకే ట్రాక్ రికార్డు పట్టించుకోకుండా మరీ చిరంజీవి చూడాలని ఉంది అవకాశం ఇచ్చారు. దాన్ని బ్లాక్ బస్టర్ చేయడం ద్వారా నమ్మకం నిలబెట్టుకున్న గుణశేఖర్ ఒక్కడుతో ఎక్కడికో వెళ్లిపోయారు. రికార్డులు బద్దలు కొట్టడమే కాదు మహేష్ బాబు ఇమేజ్ ని మాస్ లో పెంచిన మూవీగా దీని మీద ఫ్యాన్స్ కు ఒకరకమైన ఎమోషనల్ కనెక్షన్ ఉంది.
తర్వాత వరస ఫ్లాపులు గుణశేఖర్ ని చాలా ఇబ్బంది పెట్టాయి. మృగరాజు, సైనికుడు, అర్జున్, నిప్పు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే ఉంది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. రుద్రమదేవి ఓ మోస్తరుగా డీసెంట్ అనిపించుకోగా యశోద తిరిగి గ్రౌండ్ జీరోకి తెచ్చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యూఫోరియాతో ప్రేక్షకుల ముందుకోస్తున్నారు. ఈసారి ఆయన పెద్ద రిస్క్ తీసుకున్నారు. నగర యువతను ప్రభావితం చేస్తున్న మాదక ద్రవ్యాల కాన్సెప్ట్ తీసుకుని ఏదో యాక్షన్ థ్రిల్లర్ తరహాలో తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. నిన్న టీజర్ వచ్చిన సంగతి చాలా మంది నోటీస్ చేయలేదు.
డ్రగ్స్, వాటి తాలూకు పరిణామాలు అంటే కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉంటారు. మాస్ కి టాక్ వస్తే తప్ప ఇలాంటివి కనెక్ట్ కావు. పరిమితంగా యూత్ ని టార్గెట్ పెట్టుకుని అది కూడా వాళ్ళ తప్పులను హైలైట్ చేసే సినిమా అంటే మెప్పించడం అంత సులభంగా ఉండదు. ఇందులో దాదాపు అందరూ కొత్తవాళ్లే నటిస్తున్నారు. హీరో తల్లిగా ఒక్కడు హీరోయిన్ ని భూమికని ఎంపిక చేసుకోవడం ద్వారా గుణశేఖర్ కొంచెం డిఫరెంట్ గా ఆలోచించారు. మరి యుఫోరియా ఆయనకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో వేచి చూడాలి. స్వంత నిర్మాణంలో తీశారు కాబట్టి నష్టమైనా లాభమైనా గుణశేఖర్ కే దక్కుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates