ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి.. 8 నెలలు పూర్తయింది. వాస్తవానికి ఎనిమిది నెలలు పెద్ద ఎక్కువ కాలం కాకపోయినా.. సీనియర్ సీఎం, 14 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు కావడంతో సహజంగానే చంద్రబాబుపై ఆసక్తి ఉంటుంది. అదే ప్రజల్లోనూ నెలకొంది. అభివృద్ది బాటలో నడిపించాలని ఏపీని తిరిగి గాడిలో పెట్టాలని భావించిన ప్రజలు.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయా విషయాలను చంద్రబాబు ప్రస్తావించారు.
ప్రజలకు కూటమి సర్కారుపై ఎనలేని విశ్వాసం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అనేక రూపాల్లో ప్రజలు ప్రభుత్వం నుంచి కూడా ఆశిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఈ ఎనిమిది నెలల కాలంలో కూటమి పరంగా సాధించిన విజయాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లి వివరించాలని చంద్రబాబు సూచించారు. ఒకవైపు ఆర్థిక భారం ఉన్నప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సర్కారు కట్టుబడి ఉందన్న సంకేతాలను ప్రజలకు వివరించాలన్నారు.
ప్రధానంగా చంద్రబాబు చెప్పిన ఎనిమిది విజయాల్లో.. పింఛన్ల పెంపు, ప్రతి లబ్ధిదారుడికి వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అన్నా క్యాంటీన్లు, రహదారుల నిర్మాణం, అమరావతిని పుంజుకునేలా చేయడం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాల కల్పనకు పెద్ద పీట వేయడం వంటివి ఉన్నాయి. ఆయా కార్యక్రమాలను సక్సెస్ చేయడం ద్వారా.. ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు.