విజయవాడ మాజీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయకుడు కేశినేని నాని.. తిరిగి వైసీపీ గూటికి చేరుతారని.. గత నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో కాదు, మా పార్టీలోకి వస్తున్నారంటూ.. బీజేపీ నాయకులు కూడా అంతర్గత చర్చల్లో చెబుతున్నారు.
వైసీపీలోకి రావాలని నాని ప్రయత్నిస్తున్నారని.. వైసీపీ శిబిరం నుంచి లీకులు వస్తున్నాయి. ఆయనకు, జగన్‌కు మధ్య గట్టి అనుబంధం ఉందని.. ఈ క్రమంలో తిరిగియాక్టివేట్ అవుతున్నారన్నది వైసీపీ నేతల మాట.
ఇక, బీజేపీ అగ్రనాయకులు నితిన్ గడ్కరీ, అమిత్‌షా వంటివారితో నానికీ ప్రత్యేక అనుబంధం ఉందని.. ఈ నేపథ్యంలో నాని త్వరలోనే బీజేపీ గూటికి చేరుతారంటూ.. ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
అయితే.. తాజాగా ఈ వ్యాఖ్యలపై నాని రియాక్ట్ అయ్యారు. “నా రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి నా వైఖరిని స్పష్టం చేస్తున్నాను. గత ఏడాది జూన్ 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికం గా ప్రకటించాను. ఆ నిర్ణయం మారదు“ అని నాని తాజాగా ప్రకటించారు.
అంతేకాదు.. తాను రాజకీయాల నుంచి తప్పుకొన్నప్పటికీ.. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని హృదయపూర్వకంగా నమ్ముతున్నట్టు తెలిపారు. ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని పేర్కొన్నారు.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్న నాని… సమాజానికి తన సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదని స్పష్టం చేశారు.
`విజయవాడలోని నా తోటి పౌరుల శ్రేయస్సు.. నా లోతైన అంకితభావంతో ముడిపడి ఉంది. నా రాజకీయ పునరాగమనానికి సంబంధించి నిరాధారమైన వార్తలను విస్మరించమని నేను అందరినీ కోరుతున్నాను. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం, దానిలోని ప్రజల అభివృద్ధి, శ్రేయస్సుకు అన్ని విధాలుగా సహకరించడంపై మాత్రమే నా దృష్టి ఉంది“ అని నాని పేర్కొన్నారు.
కాగా.. గత ఏడాది ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నాని ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం.. రాజకీయంగా దూరమవుతున్నట్టు ప్రకటించారు.