గెలుపే కాదు… మెజారిటీ కూడా ముఖ్యమే

ఏపీలో మరో 10 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా… వాటిలో ఓ స్థానం టీచర్స్ కోటా ఎమ్మెల్సీ. దీని గురించి పార్టీలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన రెండు పట్టభద్రుల ఓట్లతో జరిగే ఎమ్మెల్సీ స్థానాలు.

ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలు అత్యంత కీలకమైన స్థానాలే. ఈ రెండు స్థానాలను దక్కించుకునేందుకు టీడీపీ నేతృత్వంలోని కూటమి పకడ్బందీగా వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూటమి పార్టీల నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి 93 శాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించిన విషయాన్ని ఆయన నేతలకు పదే పదే గుర్తు చేశారు. 93 శాతం స్ట్రైక్ రేటు అన్నది మామూలు విషయం కాదన్న చంద్రబాబు… అదే దూకుడును కొనసాగిస్తే… విపక్షం దానికదే బలహీనం అయిపోతుందని తెలిపారు.

ఫలితంగా ప్రతి ఎన్నికల్లో కూటమి విజయం నల్లేరుప నడక మాదిరిగా సాగుతుందన్నారు. అంటే… ఏ ఎన్నిక వచ్చినా… పార్టీ శ్రేణులు పెద్దగా కష్టం లేకుండానే పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని తెలిపారు. అధికారంలో ఉన్నందున ప్రజలకు ఏమేం చేస్తున్నామన్న విషయాన్ని వివరిస్తూ సాగితే సరిపోతుందని కూడా చంద్రబాబు తెలిపారు.

అయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయంపై తనకు ఎలాంటి అనుమానం లేదని చంద్రబాబు వ్యాఖ్యానిచారు. తన దృష్టి అంతా కూటమి అభ్యర్థులకు వచ్చే మెజారిటీ మీదే ఉందని తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లంతా ఉన్నత విద్యావంతులుగా ఉన్న పట్టభడ్రులే కాబట్టి… వారిలో విశ్వాసం నెలకొనేలా వ్యవహరిస్తే సరిపోతుందన్నారు.

ఈ ఎన్నికల్లో మెజారిటీ సాధిస్తే… అన్ని వర్గాల్లో కూటమికి పట్టున్నట్లేనని తేలిపోతుందన్నారు. చదువుకున్నోడు మనకు ఓటు వేస్తే.. సమాజానికి మనం మంచి చేస్తున్నట్టే కదా. అని పేర్కొన్న చంద్రబాబు… ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు రికార్డు మెజారిటీ దక్కేలా చేయాల్సిందేనని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.