చెల‌రేగిన `య‌న‌మ‌ల`… వైసీపీకి ఏం షాక్ ఇచ్చారులే!

టీడీపీ సీనియ‌ర్ నేత‌,మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.. ఇటీవ‌ల కాలంలో పెద్దగా రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. చంద్ర‌బాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా..య‌న‌మ‌ల‌కు మంత్రి ప‌ద‌వి ఖాయం. అయితే.. ఈ సారి కూట‌మి స‌ర్కారులో మాత్ర‌మే య‌న‌మ‌లకు అవ‌కాశం ద‌క్క‌లేదు.

ఈ నేప‌థ్యంలో య‌న‌మ‌ల మౌనంగా ఉంటున్నారు. దీంతో ఆయ‌న‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పార్టీ కోసం ప‌నిచేయ‌రా? అంటూ..కొంద‌రు స‌టైర్లు కూడా వేస్తున్నారు. ప్ర‌స్తుతం య‌న‌మ‌ల ఎమ్మెల్సీగా ఉన్న విష‌యం తెలిసిందే.

ఇదిలావుంటే.. తాజాగా య‌న‌మల చెల‌రేగిపోయారు. వైసీపీకి భారీ షాక్ ఇచ్చే ప‌ని చేప‌ట్టారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం (ప్ర‌స్తుతం య‌న‌మల కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా ఉన్నారు) తునిలో వైసీపీ దూకుడుకు అడ్డుక‌ట్ట వేస్తూ.. ఆ పార్టీకి చెందిన కౌన్సిల‌ర్ల‌ను టీడీపీ గూటికి చేర్చారు. ఒక్కొక్క‌రుగా కాదు.. అన్న‌ట్టుగా.. ఒకేసారి.. ప‌ది మందికిపైగా కౌన్సిల‌ర్ల‌ను టీడీపీలోకి ఆహ్వానించి ప‌చ్చ‌కండువా క‌ప్పారు.

తుని పట్టణానికి చెందిన ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు గ‌తంలోనే టీడీపీలో చేరారు. ఇక‌, తాజాగా ఇప్పుడు మరో 10 మందిని య‌న‌మ‌ల ఆహ్వానించి.. సైకిల్ ఎక్కించుకున్నారు.

దీంతో మొత్తంగా టీడీపీలో చేరిన కౌన్సిల‌ర్ల సంఖ్య 13కు చేరింది. వీరందరికీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృ ష్ణుడు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇదిలావుంటే.. త్వ‌ర‌లోనే తుని మునిసిప‌ల్ వైస్ చైర్మ‌న్ ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈ మార్పులు.. కూట‌మి పార్టీల‌కు బ‌లంగా మార‌నున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో ప‌ట్టున్న వైసీపీ.. తాజాగా తునిలో బ‌లాన్ని కోల్పోవ‌డంతోపాటు.. మునిసిప‌ల్ వైస్ చైర్మ‌న్ పీఠాన్ని కూడా కోల్పోయే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇదిలావుంటే.. తుని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత దాడిశెట్టి రాజా ప్ర‌స్తుతం మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.