అసలే అక్కడ విపక్ష పార్టీకి చెందిన బడా నేతలు సందు దొరికితే చాలు.. దూరేద్దామని చూస్తున్నారు. అలాంటి చోట అధికార పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకపోతే ఎలా? పార్టీ క్రమంగా బలహీనపడుతుంది కదా. ఆ మాత్రం తెలియకుండా ఎవరికీ వారే అన్న రీతిన నేతలు వ్యవహరిస్తే ఎలా? ఇకపై అలాంటి పరిస్థితిని ఉపేక్షిందేది లేదు అంటూ టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీకి చెందిన కీలక నేతలను ఎమ్మెల్యే కలుపుకుని వెళ్లక తప్పదు. అదే సమయంలో పార్టీ నేతలు కూడా ఎమ్మెల్యేతో కలిసి నడవక తప్పదు.
ఇదే మాటను కాస్తంత గట్టిగా చెప్పేందుకు ఎమ్మెల్యేతో పాటు పార్టీకి చెందిన కీలక నేతకు అధిష్ఠానము నుంచి పిలుపు వచ్చింది. వారిద్దరూ బుధవారం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళుతున్నారు. అక్కడ వారిద్దరితో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ కానున్నారు. ఈ భేటీలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషతో పాటుగా పార్టీ యువజన విభాగం తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ఒకే తాటిపై నడుస్తామంటూ ఒప్పుకుని తీరక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మదనపల్లెలో అధివృద్దితో పాటుగా సంక్షేమ పథకాల అమలు కూడా పక్కాగానే సాగుతున్నాయి. అయితే అక్కడ పార్టీ నేతల మధ్య సమన్వయమే కొరవడింది. ఇదే ఇప్పుడు సమస్యగా పరిణమించింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గానికి చెందిన ఈ సమస్యపై అధిష్టానం ఒకింత సీరియస్ గానే ద్రుష్టి సారించింది. చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న షాజహాన్ బాషా ఎన్నికల్లో విజయం సాధించాక పార్టీ నేతలతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో తెలుగు యువత అధ్యక్షుడు చినబాబు కూడా ఆయనతో డీ అంటే డీ అంటున్నారు. ఫలితంగా.. మదనపల్లెలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. రెండు రోజుల క్రితం చినబాబుపై దాడికి ఎమ్మెల్యే వర్గం యత్నించిందన్న వార్తలతో అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిద్దరిని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిచింది. ఈ భేటీలో వారిద్దరూ కలిసి పని చేస్తామని ఒప్పుకుని తీరాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates