వైసీపీ నాయకులు కొందరు.. పార్టీ అధినేత జగన్ లేఖ సంధించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు పొక్కింది. పార్టీ తరఫున పోరాడేందుకు తమకు కొంత సమయం కావాలని.. ఇప్పటికిప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదని వారు కుండబద్దలు కొట్టి చెప్పినట్టు సమాచారం. ప్రజల మధ్యకు వెళ్లేందుకు చాలానే సమయం ఉందని.. ప్రస్తుతం ఇంకా కూటమి సర్కారుపై మనం అనుకుంటున్న స్థాయిలో వ్యతిరేకత పెల్లుబుకలేదని కూడా వారు పేర్కొన్నారట.
అయితే.. ఈ లేఖ ఏజిల్లాకు చెందిన నాయకులు రాశారనేది మాత్రం అత్యంత గోప్యంగా ఉంచుతున్నా రు. ఇటీవల లండన్ నుంచి వచ్చిన జగన్.. పలు జిల్లాలకు చెందిన నాయకులను పిలిచి.. సమావేశం పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రజల మద్యకు రావాలని.. ప్రజలతో కలవాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని.. దానిని మనకు అనుకూలంగా మార్చుకోవలని కూడా జగన్ దిశానిర్దేశం చేశారు.
అయితే.. తాను ప్రజల్లోకి వచ్చేందుకు సమయం పడుతుందని కూడా ఆ సమావేశాల్లోనే జగన్ వెల్లడించా రు. ఇక, మీడియాతోనూ జగన్ ఇదే చెప్పారు. తాను వచ్చేందుకు సమయం పడుతుందన్నారు. అయితే.. ఈ లోగా పార్టీతరఫున తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కానీ, ఈ విషయంలో పార్టీ నాయకుల అభిప్రాయం వేరేగా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగకుండా చేపట్టే ఏకార్యక్రమం కూడా.. ఫలితం ఇవ్వబోదని అంటున్నారు. అయితే.. ఈ విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి.
వ్యతిరేకత పెరిగిందని తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల వైసీపీ నాయకులు చెబుతున్నట్టు తెలిసింది. కానీ, ఇతర జిల్లాల వారు మాత్రం ఇంకా సమయం తీసుకుంటేనే బెటర్ అన్నారు. అయితే.. గత ఎన్నికల్లోనూ తూర్పు, పశ్చిమ, గుంటూరు నేతలు చెప్పిన మాటలే నమ్మారన్న.. వివాదం కూడా వినిపించింది. ఇదే పార్టీని ఓటమి దిశగా నడిపించిందని.. ఇతర జిల్లాల నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు వ్యతిరేతక లేనందున.. వచ్చినా ప్రయోజనం లేదని అంటున్నారు.
అందుకు బయటకు వచ్చేందుకు.. పోరాటాలు చేసేందుకు.. తమకు కొంతసమయం కావాలని కోరుతూ.. రెండు జిల్లాలకు చెందిన నాయకుల నుంచి నాలుగు ఉత్తరాలు చేరాయని వైసీపీ కార్యాలయంలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిని జగన్ ఏ కోణంలో చూస్తారో చూడాలి. దీనిని వ్యతిరేకతగా భావిస్తారో.. లేక.. సానుకూలంగా తీసుకుంటారో అనేది ఆసక్తిగా మారింది.