సీఎం ర‌మేష్ వ‌ర్సెస్ ఆది.. బీజేపీలో కుమ్ములాట ..!

ఏపీ బీజేపీలో సీనియ‌ర్ నాయ‌కుల మ‌ధ్య కుమ్ములాట‌లు జోరుగా సాగుతున్నాయి. పార్టీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కూడా.. నాకెందుకులే అని ఊరుకుంటున్నారు. నిజానికి కుమ్ములాడుకుంటున్న నాయ‌కుల‌కు కేంద్రం స్థాయిలో మంచి ప‌లుకుబ‌డి ఉండ‌డంతోపాటు.. బ‌ల‌మైన ఆర్థిక నేప‌థ్యం, రాజ‌కీయ నేప‌థ్యం కూడా ఉంది. దీంతో వారిని చూసి చూడ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ధానంగా చిన్న త‌ర‌హా నాయ‌కులు కీచులాడుకుంటే వేరేగా ఉండేది. కానీ, పెద్ద నాయ‌కులే కోట్లాడుతున్నారు.

అన‌కాప‌ల్లి ఎంపీగా ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడు సీఎం ర‌మేష్‌.. ఎక్క‌డో క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యేగా ఉన్న ఆది నారాయ‌ణ‌రెడ్డిల మ‌ధ్య వివాదాలు భారీ స్థాయిలో సాగుతున్నాయి. నిజానికి క‌డ‌ప జిల్లా కు చెందిన నాయ‌కుడే అయినా.. ర‌మేష్‌.. అన‌కాప‌ల్లికి వ‌చ్చి రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇక్క‌డ‌కూడా పార్టీ నేత‌లతో ఆయ‌న‌కు స‌ఖ్య‌త లేదు. పైగా.. స్థానికంగా కూడా.. ఆయ‌న కాంట్రాక్టులు, ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల్లో దూకుడుగానే ఉన్నారు.

ఇక‌, సొంత జిల్లా క‌డ‌ప‌లోనూ త‌న‌దే పైచేయిగా ఉండాల‌న్న ఉద్దేశంతో అక్క‌డ కూడా రాజ‌కీయాలు ఉద్రుతం చేశారు. దీనిలో బాగంగా ఆదికి చెందిన అనుచ‌రుల‌పై ఏకంగా ఎస్పీ, క‌లెక్ట‌ర్‌కు సీఎం ర‌మేష్ లేఖ రాసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆది ఫామ్ హౌస్‌లో పేకాట సిబిరాలు, మ‌ట్కా సిబిరాలు న‌డుస్తున్నాయ‌న్న‌ది సీఎం ర‌మేష్ ఆరోప‌ణ‌. దీంతో పోలీసులు గ‌త నాలుగు రోజుల నుంచి ఇక్క‌డ పికెట్ ఏర్పాటు చేయ‌డంతోపాటు.. ఆది వ‌ర్గీయుల‌ను కూడా అరెస్టు చేశారు.

ఇదంతా సైలెంట్‌గా జరిగిపోయింది. అయితే.. ఆది మాత్రం కేంద్రంలోని బీజేపీ అధిష్టానికి సీఎం ర‌మేష్‌పై ఫిర్యాదులు చేశారు. రాష్ట్ర స్థాయిలో ఆయ‌న ప్ర‌య‌త్నించినా.. సీఎం ర‌మేష్‌ను క‌ట్ట‌డి చేయ‌లేక పోతున్నార‌న్న వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర బీజేపీ పెద్ద‌ల‌కు మొర పెట్టుకున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డో ఎంపీగా ఉన్న ర‌మేష్ వేలు పెడుతున్నార‌ని.. త‌న వ్యాపారాల‌ను దెబ్బతీస్తు న్నార‌ని ఆది వాపోతున్నారు. సీఎం ర‌మేష్ మాత్రం అసాంఘిక వ్య‌వ‌హారాల‌పైనే తాను ఫిర్యాదు చేశాన‌ని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఇది వ్య‌క్తుల మ‌ధ్య‌, నాయ‌కుల మ‌ధ్య క‌న్నా.. సొంత పార్టీలోనే కుమ్ములాట‌లు గా ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.