తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి శరవేగంగా దూసుకువస్తున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రిగ కజగం పేరిట రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ ఒకింత సీరియస్ గానే రాజకీయం చేయనున్నట్టు ప్రకటించారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో విజయ్ పార్టీ భారీ ఎత్తున రంగంలోకి దిగిపోతున్నట్టుగా సమాచారం.
ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ అంచనాలు నిజమేనన్నట్టుగా విజయ్ కూడా ఇకపై సినిమాలు చేయనని… ఇక ఫుల్ టైమే రాజకీయాలకే కేటాయిస్తానని ప్రకటించారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విజయ్ రాజకీయాలకు సంబంధించి ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన పొలిటికల్ స్ట్రాటెజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో జట్టు కట్టేందుకు విజయ్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ దిశగా పీకే తో ఇప్పటికే విజయ్ మాట్లాడారని.. విజయ్ ప్రతిపాదనలకు పీకే కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది.
అయితే వీరిద్దరి మధ్య ఇప్పటిదాకా ఒప్పందం ఏదీ జరగలేదని, త్వరలోనే అది కూడా పూర్తి కానుందని విజయ్ సన్నిహితులు చెబుతున్నారు. ఒప్పందం పూర్తి కాగానే పీకే రంగంలోకి దిగేందుకు సిద్దంగానే ఉన్నట్టు సమాచారం.
జాతీయ స్థాయిలో బీజేపీకి సేవలు అందించిన పీకే… మోడీ నేతృత్వంలోని ఎన్డీయేను అధికారంలోకి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టిన పీకే… జగన్ నేతృత్వంలోని వైసీపీకి వ్యూహాలు అందించారు. ఫలితంగా జగన్ ను కూడా పీకే సీఎం ను చేశారు.
ఈ నేపథ్యంలో పీకే రాజకీయ వ్యూహాలు అంటే… దేశంలోని ప్రతి పార్టీ కోరే పరిస్థితి వచ్చింది. అయితే రాజకీయ వ్యూహాలు అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన ఐ ప్యాక్ ను వదిలేసిన పీకే.. ఇప్పుడు వ్యక్తిగతంగానే ముందుకు సాగుతున్నారు. ఇటీవలే ఆయన ఢిల్లీ వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు.
తాజాగా విజయ్ తో భేటీ తర్వాత పీకే మరో సంస్థను ఏర్పాటు చేసి… దానితో విజయ్ పార్టీకి సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటె… ఇప్పటికే విజయ్ తో చర్చలు పూర్తి అయిన నేపథ్యంలో విజయ్ రాజకీయ ప్రస్థానం కోసం పీకే ఓ రూట్ మ్యాప్ ను సిద్ధం చేసినట్టు సమాచారం.
దీని ప్రకారం… జగన్ మాదిరిగానే విజయ్ తోనూ పీకే ఓ భారీ పాదయాత్రను ప్లాన్ చేసినట్టు సమాచారం. పాదయాత్ర కుదరకపోతే బస్సు యాత్రను అయినా విజయ్ తో చేయించాలని పీకే తీర్మానించారట. చూద్దాం మరి ఏంజరుగుతుందో?