‘తాళం` తీసేవారు లేరు.. వైసీపీ ఏం చేస్తుంది?

ఔను.. నిజ‌మే! ఏపీలో వైనాట్ 175 నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ్లిన వైసీపీ.. కేవ‌లం 11 స్థానాల‌కే ప‌రిమితమైంది. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసింది. ఊహించ‌ని ప‌రాజ‌యం… పార్టీ అధినేత జ‌గ‌న్ వేసుకున్న లెక్క‌లు దారి త‌ప్ప‌డం తెలిసిందే. అయితే..ఈ ప్ర‌భావం.. పార్టీ నాయ‌కుల‌పై భారీగానే ప్ర‌భావం చూపించింది. ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకోవ‌డం లేదంటూ.. జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగిన నాయ‌కులు ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే అనేక మంది నాయ‌కులు పార్టీకి దూరంగా ఉన్నారు. మ‌రికొంద‌రు పార్టీ మారారు. ఇక‌, చాలా మంది పార్టీలోనే ఉన్నా.. కార్య‌క్ర‌మాల‌కు కూడా హాజ‌రు కావ‌డం లేదు. దీంతో సుమారు 50కి పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ కార్యాల‌యాల‌కు తాళాలు తీసేవారు కూడా క‌రువ‌య్యారు. పార్టీ అధికారంలో ఉండ‌గా.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్య‌లో పార్టీకి కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేసుకుంది. దీనికిగాను ప్రభుత్వ భూముల‌ను కూడా కేటాయించుకున్నారనే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఆయా కార్యాల‌యాల‌కు కేటాయించిన స్థ‌లాలు.. నిర్మాణాల్లో జ‌రిగిన అవినీతి.. వంటి వాటిపై కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత కేసులు కూడా పెట్టారు. కొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్న‌వాటిని నిలుపుద‌ల చేయించారు. అయితే.. వైసీపీ హుటాహుటిన కోర్టును ఆశ్ర‌యించి.. వాటిపై స్టే తెచ్చుకుంది. ఇది నాణేనికి ఒక‌వైపు. అయితే..ఇప్పుడు అస‌లు కార్యాల‌యాల‌కు ఉన్న తాళాలు కూడా తెరిచే వారు లేకుండా పోయారు. విజ‌య‌వాడ‌, గుంటూరు, ప‌ల్నాడు, శ్రీకాకుళం, తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, ఎన్టీఆర్ జిల్లా, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, ప‌శ్చిమ‌, తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఎక్క‌డా నాయ‌కులు.. పార్టీ కార్యాల‌యాల‌కు రావ‌డం లేదు. క‌నీసం కార్య‌క‌ర్త‌ల‌తోనూ భేటీ కావ‌డం లేదు. ఈ ప‌రిణామాలు.. కూట‌మి స‌ర్కారుకు ద‌న్నుగా మారాయి. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. మంత్రి డోలా బాల వీరాంజ‌నేయస్వామి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఆఫీసుల‌కు టూలెట్ బోర్డులు(అద్దెకు ఇవ్వ‌బ‌డు ను) వేలాడ‌దీసే రోజులు త్వ‌ర‌లోనే రానున్నాయి అని ఆయ‌న వ్యాఖ్యానించారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఇది వాస్త‌వ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా.. చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోని వైసీపీ ఆఫీసు ఇప్పుడు టిఫెన్ సెంట‌ర్‌గా మారిన విష‌యం తెలిసిందే.