అసలు నువ్వు మహిళవేనా?… రజినీఫై స్ట్రాంగ్ కౌంటర్!

వైస్సార్సీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజిని శనివారం న్యూటన్ థియరీతో ఓ రేంజిలో ఫైర్ అయిపోయిన సంగతి తెలిసిందే. తనపైనా, తన కుటుంబ సభ్యుల పైనా అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి, ప్రస్తుతం చిలకలూరిపేట ఎమ్మెల్యే గా ఉన్న టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై ఆమె ఒంటికాలిపై లేచిన సంగతి తెలిసిందే. పనిలో పనిగా అధికారుల పైన కూడా రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అందరికి బదులు ఇచ్చి తీరతామని హెచ్చరికలు జారీ చేశారు.

రజిని వ్యాఖ్యలు విన్నంతనే,…ప్రత్తిపాటి ఆగ్రహోదగ్రులయ్యారు.మహిళ అని చెప్పుకుంటున్న రజిని.. ఓ మహిళగా ప్రవర్తిస్తున్నారా అంటూ రివర్స్ ఎటాక్ చేశారు. రజిని వ్యాఖ్యలపై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చిన ప్రత్తిపాటి… చిలకలూరిపేటకు, బీసీలకు రజిని చేసింది తీరని అన్యాయమేనని ఆరోపించారు. ఐదేళ్లకే దిక్కులేని రజినీకి 30 ఏళ్ల రాజకీయం సాధ్యమేనా అని కూడా ఆయన ప్రశ్నిచారు. అన్నేసి ఏళ్లు రజిని అసలు రాజకీయాల్లో ఉంటారా? అని ఆయన ఎద్దేవా చేశారు.

ఆ తర్వాత రజినీని మరింతగా టార్గెట్ చేసిన ప్రత్తిపాటి… ఘాటు వ్యాఖ్యలు చేశారు. ”ఓటేసిన ప్రజలను మోసం చేశావు. నమ్ముకుని పనిచేసిన నాయకుల్ని మోసం చేశావు. 2019 ఎన్నికల్లో నాన్న, బాబాయ్ అని పిలిచి వాళ్ళిద్దర్నీ మోసం చేసావు. తీరా ఇక్కడ ఓడిపోతావు అని తెలిసి వీళ్ళందర్నీ గాలికి వదిలేసి గుంటూరు పారిపోయావు. మళ్లీ ఇప్పుడొచ్చి ఒక బీసీని, ఒక మహిళని అని మాట్లాడుతున్నావు. సమాజంలో ఎంతో గౌరవంగా బతికే బీసీలు చేసే పనేనా నువ్వు చేసేది? గౌరవనీయ మహిళగా మహిళలు చేసే పనులేనా నువ్వు చేసింది? నువ్వు అసలు మహిళవేనా?” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలుచేశారు.