ఆపరేషన్ అరణ్యకు శ్రీకారం చుట్టిన పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖల బాధ్యతలు ఏరికోరి మరీ పవన్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. మొన్నటిదాకా గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించిన పవన్… అందులో అద్భుతాలనే సృష్టించారని చెప్పక తప్పదు. పవన్ చర్యల వల్ల చాలా గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ఆ శాఖను గాడిలో పెట్టిన పవన్ ఇప్పుడు అటవీ శాఖపై దృష్టి సారించారు.

అటవీ శాఖపై ఇప్పటికే ఓ సారి సమీక్ష చేసిన పవన్.. అందులో ఉన్న సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. ఆ తర్వాత తనకు తాను సొంతంగా అటవీ శాఖలో జరుగుతున్న అక్రమాలు.. వాటిని నిర్మూలించేందుకు చేపట్టాల్సిన చర్యలను పవన్ నిర్దేశించుకున్నట్టు సమాచారం. ఈ కసరత్తు పూర్తి కాగానే… సమయం కోసం ఎదురు చూసిన పవన్…ఆ సమయం రాగానే తన నూతన టార్గెట్ ను ప్రకటించారు. ఆపరేషన్ అరణ్య పేరిట ఇప్పుడు రంగంలోకి దిగుతున్న పవన్… అటవీ శాఖలోని సకల రోగాలకు చెక్ పెట్టె దిశగా పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు.

ఆపరేషన్ అరణ్యలో భాగంగా తొలుత ఎర్రచందనం అక్రమ రవాణాపై పవన్ దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా ఎర్రచందనాన్ని రాష్ట్రం దాటిస్తున్న స్మగ్లర్లను కట్టడి చేయడంపై దృష్టి సారించనున్నారు. ఎక్కడికక్కడ స్మగ్లర్లను అరెస్ట్ చేయడం ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టవచ్చన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. సరిగ్గా శుక్రవారం తిరుపతిలోని టాస్క్ ఫోర్స్ పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని పట్టుకుంది. ఈ ఘటనపై స్పందించిన పవన్… ఈ రోజే కొత్త మిషన్ కు సరైన సమయం అని భావించి ఆపరేషన్ అరణ్యకు శ్రీకారం చుట్టారు.

ఇక ఈ ఆపరేషన్ అరణ్యలో అటవీ భూముల పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణ, జనారణ్యాల్లోకి ప్రవేశిస్తున్న ఏనుగులను నిలువరించడం, ఏనుగులు, ఇతర వన్య ప్రాణుల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటం, అటవీ భూములను దురాక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడం, పచ్చదనాన్ని పెంచడంతో పాటుగా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేలా చర్యలు చేపట్టడం వంటి వాటిపై పవన్ దృష్టి సారించనున్నారు. ఈ చర్యలు పకడ్బందీగా అమలు అయితే… అటవీ శాఖలో సమూల ప్రక్షాళన జరిగినట్టేనని చెప్పాలి.