స్వర్ణలత, సత్యవతి వద్దు.. కృష్ణకుమారికి కిరీటం

పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు… ఓ పదవి విషయంలో ఎంపీ, ఎమ్మెల్యే జుట్లు పట్టుకుంటే వారిద్దరికీ షాకిస్తూ మూడో వ్యక్తికి పదవి దక్కింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మునిసిపల్ చైర్ పర్సన్ పదవి విషయంలో ఇదే జరిగింది. నందిగామ మునిసిపల్ చైర్మన్ పదవిని తాను సూచించిన అభ్యర్థికి ఇవ్వాలని స్థానిక ఎంపీ హోదాలో కేశినేని చిన్ని ఓ అభ్యర్థి పేరును ప్రతిపాదించారు. అయితే ఎంపీ సూచించిన అభ్యర్థిని వ్యతిరేకించిన స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తాను ఇంకో అభ్యర్థిని ఎంపిక చేశారు. ఈ తలనొప్పి ఎందుకని భావించిందో. ఏమో తెలియదు గానీ… వీరిద్దరి అభ్యర్థులను పక్కనపెట్టేసిన టీడీపీ అధిష్ఖానం మూడో వ్యక్తిని తెర మీదకు తీసుకువచ్చింది. ఆ అభ్యర్థికి అటు ఎమ్మెల్యేతో పాటు ఇటు ఎంపీ కూడా ఓకే చెప్పక తప్పలేదు.

నందిగామ మునిసిపల్ చైర్మన్ పదవి కోసం కౌన్సిలర్ సత్యవతి పేరును సౌమ్య ప్రతిపాదించారు. అయితే కేశినేని చిన్ని మాత్రం కౌన్సిలర్ స్వర్ణలతను ప్రతిపాదించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రతిపాదన తెలిసిందో, లేదో… తెలియదు గానీ.. ఎంపీ సూచించిన అభ్యర్థి స్వర్ణలత పేరిట అధిష్ఠానం బీ పామ్ ను జారీ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేను అయిన తనను కాదని తన పరిదిలోని మునిసిపల్ చైర్ పర్సన్ ఎలా ఎంపిక చేస్తారని ఆమె వాదించారు. దీంతో అధిష్ఠానం ఆలోచనలో పడిపోయింది. ఇదే విషయాన్ని ఎంపీ వద్ద ఆరా తీయగా…ఆయన కూడా నీళ్లు నమిలారట.

ఇలాగైతే కుదరదని భావించిన అధిష్ఠానం సౌమ్య ప్రతిపాదించిన సత్యవతి, చిన్ని ప్రతిపాదించిన స్వర్ణలతల అభ్యర్థిత్వాలను పక్కనపెట్టాలని తీర్మానించింది. అంతేకాకుండా వారిద్దరూ కాకుండా మధ్యేమార్గంగా కౌన్సిలర్ కృష్ణ కుమారిని చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటిస్తూ బీ ఫామ్ ను విడుదల చేసింది. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా సౌమ్య అసంతృప్తి వ్యక్తం చేశారట. అంతేకాకుండా బీఫామ్ లేకుండానే సత్యవతిని చైర్ పర్సన్ బరిలో నిలిపేందుకు కూడా ఆమె సాహసించారట. విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ నేరుగా రంగంలోకి దిగిపోయి… పార్టీ అధిష్ఠానాన్ని ఎవరైనా పాటించి తీరాల్సిందేనని హుకుం జారీ చేశారట. అలా పాటించకుంటే మీ ఇష్టం అంటూ కూడా ఆయన ఒకింత కఠువుగానే వ్యవహరించారట. దీంతో వెనక్కు తగ్గిన సౌమ్య అధిష్ఠానం అభ్యర్థి కృష్ణ కుమారి అభ్యర్థిత్వానికి జైకొట్టేశారట.