“రాజకీయాలు కుళ్లిపోయాయి. ఆయన మా తండ్రి అని చెప్పుకొనేందుకు సిగ్గుపడుతున్నా” ఓ 15 ఏళ్ల కిందట కర్ణాటకలో జరిగిన రాజకీయం ఇది! కీలక నేత ఒకరు తన కుర్చీని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంలో చివరకు తండ్రితోనే విభేదించారు. సో.. విషయం ఏంటంటే రాజకీయాల్లో ఇలా జరుగుతుందని కానీ, ఇలానే జరగాలని కానీ ఎవరూ చెప్పరు. ‘రాజకీయాలకు ఊసరవెల్లికి మధ్య అవినాభావ సంబంధం ఉంది’ అంటాడు మార్క్స్. ఎవరి అవసరం-ఎవరి అవకాశం అనేదే ప్రాతిపదికగా రాజకీయాలు సాగుతున్నాయి.
కాబట్టి రాజకీయాల్లో ఏదీ తప్పుకాదు. తాజాగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన కీలక నాయకుడు, జగన్‌కు ఆత్మగా పేర్కొనే వ్యక్తి వేణుంబాకం విజయసాయిరెడ్డి.. నిన్న మొన్నటి వరకు తనను తిట్టిపోసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల వరకు వెళ్లారని.. మూడు గంటల పాటు అక్కడే ఉన్నారని ఆమెతో కలిసి భోజనం కూడా చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిని బూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. రాజకీయాల కోసం.. ప్రజల సింపతీ కోసం.. మీడియా ముందు, బహిరంగ సభల్లోనూ చేసుకునే విమర్శలు కూడా విమర్శలేనా?!
పార్లమెంటులో వాజపేయిని తిట్టిపోసి.. సొంత రాష్ట్రం తిరిగి వచ్చాక.. ఆయనకు గులాబ్ జాములు పంపించిన మమతా బెనర్జీ ముందు.. షర్మిల రాజకీయం పెద్దదేం కాదు. సో.. రాజకీయాల్లో ప్రత్యర్తులు మాత్రమే ఉంటారు తప్ప.. శత్రువులు ఉండరు. కాబట్టి సాయిరెడ్డి వెళ్లడమూ తప్పుకాదు… షర్మిల ఆయనకు భోజనం వడ్డించడమూ తప్పుకాదు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక విజయమ్మ ఉన్నారని మరో టాక్ వినిపిస్తోంది. సాయిరెడ్డి పట్ల సోదర భావంతో ఉండే విజయమ్మ.. తన పిల్లల మధ్య రాజీ చేయాలని కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే సాయిరెడ్డిని ఆమె ఆహ్వానించారని.. షర్మిలతో జగన్‌కు ఉన్న విభేదాలు, వివాదాలను అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది తాజా సమాచారం. అటు జగన్‌కు కూడా సాయిరెడ్డి కీలకం. ఇటు వైఎస్ కుటుంబం లోతుపాతులు కూడా తెలిసిన వ్యక్తి. సో.. ఆయన ద్వారా కాగల కార్యం పూర్తి చేయించే క్రతువు ఏదో జరుగుతోందన్నది తాజా పరిణామాలను అంచనా వేస్తున్నవారు చెబుతున్న మాట. సో.. విజయసాయిరెడ్డి కాస్తా విజయ వారధి రెడ్డిగా మారి.. అన్నా చెల్లెళ్లను కలుపుతారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates