మోడీ సంక‌ల్పం నెర‌వేరాలి: బ‌డ్జెట్‌పై ప‌వ‌న్ రియాక్ష‌న్‌

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జెట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. శ‌నివారం రాత్రి ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. బ‌డ్జెట్‌లో దేశ బ‌హుముఖాభివృద్ధి స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని పేర్కొన్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా దేశ అభివృద్దిని కాంక్షిస్తూ.. రూపొందించిన ఈ బ‌డ్జెట్ ద్వారా మోడీ ఆశ‌యాలు సిద్ధించాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్టు తెలిపారు. ముఖ్యంగా విక‌సిత భార‌త్ ల‌క్ష్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌హిళ‌లు, పేద‌లు, రైతులు, యువ‌త కేంద్రంగా తీసుకున్న నిర్ణ‌యాలు, చేసిన ప్ర‌క‌ట‌న‌లు కూడా ఆయా వ‌ర్గాల‌కు మేలు చేస్తాయ‌ని తెలిపారు.

“రాజ‌కీయాల‌కంటే కూడా.. దేశం, ప్ర‌జ‌లు అవ‌స‌ర‌మ‌న్న అత్యున్న‌త దృక్ఫ‌థం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. స‌మాజంలోని దాదాపు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన కూర్పుగా బ‌డ్జెట్‌ను ఆయ‌న అభివ‌ర్ణించారు. ఉద్యోగుల‌కు 12 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఆదాయ ప‌న్నును మిన‌హాయించ‌డాన్ని చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యంగా పేర్కొన్నారు. పీఎం ధ‌న్ ధాన్య యోజ‌న ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్య‌వ‌సాయ స్థితిగ‌తులు మారుతాయ‌ని చెప్పారు. ప్రైవేటు వ‌డ్డీ వ్యాపారుల బెడ‌ద నుంచి రైతుల‌ను కాపాడేందు కురుణ స‌దుపాయాన్ని పెంచ‌డం ముదావ‌హ‌మ‌ని పేర్కొన్నారు. 2 ల‌క్ష‌ల నుంచి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు స‌న్న‌కారు రైతుల‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌న్నారు.

ఏపీ విష‌యంలోనూ కేంద్ర బ‌డ్జెట్‌లో మంచి కేటాయింపులు జ‌రిపార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ముఖ్యంగా ఏపీ జ‌ల జీవ‌నాడి పోల‌వ‌రం ప్రాజెక్టుకు స‌వ‌రించిన అంచ‌నాలు ఆమోదించ‌డం, బ‌కాయిల‌కు ఆమోదం తెల‌ప‌డం వంటివి ఏపీలో జ‌ల వ‌న‌రుల ప్రాజెక్టుల‌కు ఊత‌మిచ్చింద‌న్నారు. విశాఖ ఉక్కు, పోర్టుల‌కు కూడా బ‌డ్జెట్‌ల కేటాయింపులు జ‌రిగాయ‌ని, దీంతో ఆయా ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. 3295 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌డం ద్వారా విశాఖ ఉక్కుకు జీవం పోశార‌ని తెలిపారు. సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో కూట‌మి ప్ర‌భుత్వం పుంజుకునేందుకు, రాష్ట్రంలో అభివృద్ధి సాగేందుకు ఈ బ‌డ్జెట్ ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు.