టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మహానాడు పేరిట ఏటా నిర్వహిస్తున్న వేడుకలను ఈ ఏడాది వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో నిర్విహించాలని తీర్మానించారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగ్గా… ఏటా నిర్వహిస్తున్న మహానాడుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగానే ఈ దఫా కడపలో మహానాడును నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కడప జిల్లాలో టీడీపీకీ ఓ మోస్తరు బలం కనిపించినా… జగన్ హయాంలో ఆ జిల్లా నుంచి టీడీపీని తరిమివేసే దిశగా వైసీపీ అడుగులు వేసింది. అయితే మొన్నటి ఎన్నికల్లో మిగిలిన అన్ని ప్రాంతాలతో పాటుగా కడప జిల్లాలోనూ టీడీపీ సత్తా చాటింది. ఏళ్ల తరబడి వైఎస్ ఫ్యామిలీ నిలబెట్టే అభ్యర్థులే విజయం సాదిస్తూ వస్తున్న కడప అసెంబ్లీని కూడా ఈ దఫా టీడీపీ లాగేసుకుంది. పార్టీని మరింతగా బలోపేతం చేసే దిశగానే కడపలో మహానాడును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇదలా ఉంటే…మహానాడు లోగా పార్టీలో సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలని కూడా పొలిట్ బ్యూరో తీర్మానించింది. అంతేకాకుండా మహానాడులో పార్టీకి జాతీయ, రాష్ట్ర నూతన కమిటీలను ఎన్నుకోవాలని కూడా నిర్ణయించింది. రాష్ట్రంలో జిల్లాల విభజన హేతుబద్ధంగా జరగలేదని అభిప్రాయపడింది. ఇప్పటికైనా జిల్లాల విభజనలో జరిగిన లోటుపాట్లను సరిదిద్దాలని సూచించింది. దాదాపుగా 3 గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ కు కీలక బాధ్యతలు అప్పగించే అంశంపైనా కీలక చర్చ జరిగినట్టు సమాచారం. మహానాడు వేదికగానే ఈ ఘట్టాన్ని పూర్తి చేయాలని కూడా మెజారిటీ సభ్యులు ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది.