జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కాకినాడ జిల్లా పరిధిలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అంతకుముందు 2019లో పవన్ రెండు చోట్ల నిలుచున్నా…ఎమ్మెల్యేగా ఎన్నికల కాలేకపోయారు. అయితే 2024లో మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేశారు. పిఠాపురం ఓటర్లు పవన్ ను బంపర్ మెజారిటీతో గెలిపించారు. పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఏకంగా డిప్యూటీ సీఎంగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ క్రమంలో పిఠాపురం అంటే పవన్ కు ఎనలేని అభిమానం ఉంది. ఈ సంక్రాంతి వేడుకలను ఆయన పిఠాపురం వేదికగానే జరుపుకున్నారు. పిఠాపురం నియోజకవర్గానికి ఏం కావాలంటే… అది క్షణాల్లో జరిగిపోతోంది. పవన్ డిప్యూటీ సీఎం కావడంతో నిజంగానే పిఠాపురం అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల లభ్యత కూడా దక్కింది. ఇంకేం కావాలి? ఓ ఏడాదో, రెండేళ్లో కళ్లు మూసుకుంటే సరి… పిఠాపురం రూపు రేఖలే మారిపోవడం ఖాయమేనని చెప్పాలి.
ఇక్కడిదాకా బాగానే ఉన్నా… పిఠాపురం మునిసిపల్ కౌన్సిల్ మాత్రం పవన్ రాక కోసం గడచిన 7 నెలలుగా పరితపిస్తోందట. 7 నెలలుగా పవన్ అడ్రెస్ కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం పిఠాపురం మునిసిపాలిటీ చైర్ పర్సన్ గండేపల్లి సూర్యావతి అధ్యక్షతన మునిసిపల్ బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పిఠాపురం అభివృద్ధి ప్రణాళికలపై సమగ్ర చర్చ జరిగింది. ఈ చర్చలో కౌన్సిలర్లంతా యమా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు.
అయితే బోసు బాబు అనే ఓ కౌన్సిలర్ లేచి..లోకల్ ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. 7 నెలలుగా పవన్ కౌన్సిల్ సమావేశానికి వస్తారేమోనని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు. పవన్ వస్తే.. పిఠాపురం అభివృద్ధిపై చర్చిద్దామని ఆశగా ఎదురు చూస్తున్నామన్నారు. కౌన్సిల్ లోని సభ్యులందరం పవన్ రాక కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అయినా పవన్ కు కౌన్సిల్ సమావేశాల గురించి సమాచారం ఇస్తున్నారా? లేదా? అని ఆయన అదికారులను నిలదీశారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ప్రతి కౌన్సిల్ సమావేశం గురించిన సమాచారాన్ని పవన్ కు చేరవేస్తున్నామని కమిషనర్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates