ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి ఓ రోజు షాక్ తగిలితే… మరో రోజు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం అంటూ షాకిస్తే,… సోమవారం సుప్రీంకోర్టులో పార్టీ అదినేత వైఎస్ జగన్ కు భారీ ఊరట లభించింది.
తాజాగా మంగళవారం జగన్ కు అత్యంత సన్నిహితుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో గుంటూరు జైలు నుంచి సురేశ్ బుధవారం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైసీపీ అధికారంలో ఉండగా… నందిగం సురేశ్ టీడీపీని, ఇతరత్రా విపక్షాలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసేవారు. దళిత సామజిక వర్గానికి చెందిన సురేశ్ గతంలో టీడీపీ అధికారంలో ఉండగానే… రాజధాని అమరావతికి వ్యతిరేకంగా పలు కుట్రలకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఈ క్రమంలో సురేశ్ ను జగన్ దగ్గరికి తీసుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థుల జాబితాను సురేశ్ తోనే విడుదల చేయించి జగన్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసిన నందిగం విజయం సాధించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమిపాలయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates