అరదలి.. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని అరకు పార్లెమెంటుకు చెందిన ఓ కుగ్రామం. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పాలకొండ మండలానికి చెందిన ఈ గ్రామంలో దాదాపుగా 2,500 జనాభా ఉంది. ఏళ్ల క్రితమే ఏర్పడ్డ ఈ గ్రామానికి ఆది నుంచి రోడ్డు సౌకర్యం అన్న మాటే లేదు.
పొరుగే రాజుపేట అనే గ్రామం చేరుకుంటే అక్కడి నుంచి రోడ్డు సౌకర్యం ఉంది. అయితే రాజుపేటను చేరుకునేందుకు ఇప్పటికీ ఆరదలి గ్రామస్థులకు మట్టి రోడ్డే దిక్కు. 80 ఏళ్లుగా ఇదే దుస్థితి. ప్రభుత్వాలు వస్తున్నాయి… పోతున్నాయి… కానీ ఆరదలికి రోడ్డు మాత్రం రాలేదు.
అయితే ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనల సంకీర్ణ కూటమి ఏపీలో అదికారం చేపట్టిన సంగతి తెలిసిందే. కేబినెట్ లో జనసేనాని పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలను తీసుకున్నారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన పవన్.. రోడ్డు ముఖం చూడని గ్రామాలకు రహదారులను పరిచయం చేయాలని తలచారు.
అనుకున్నదే తడవుగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు లేని గ్రామాలను గుర్తించి… వాటిలో మారుమూల గిరిజన గ్రామాలకు ప్రాధాన్యం ఇచ్చి రోడ్లను మంజూరు చేశారు.
పవన్ నిర్ణయంతో అంటమేల్కొన్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ… తన నియోజకవర్గంలో 80 ఏళ్లుగా రోడ్డు ముఖం చూడని ఆరదలి విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆరదలి పరిస్థితిని చూసి జాలి పడిన పవన్.. వెనువెంటనే గ్రామానికి రూ.80 లక్షల నిధులతో రోడ్డును మంజూరు చేశారు.
ప్రస్తుతం రోడ్లు పనులు శరవేగంగా సాగుతున్నాయి. 80 ఏళ్లుగా ఎదరుచూస్తున్నా… తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం అందలేదన్న గ్రామస్తులు పవన్ రాకతో తమ కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates