అదేంటో గానీ… టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన మొదలైన నాటి నుంచి ఏపీకి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కూటమి పాలన ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రానికి ఏకంగా రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వెరసి రాష్ట్రాన్ని అంధకారం నుంచి బయటపడటం ఖాయమన్న భరోసా ప్రజల్లో నెలకొంది. కూటమి పాలన ఉన్నంత కాలం ఇక చింతలేదన్న వాదనా అంతకంతకూ బలపడుతోంది.
పరిశ్రమల శాఖ ఒక్కటేనా పెట్టుబడులను రాబట్టేది… పర్యాటక శాఖతోనూ పెట్టుబడులు సాధిస్తామంటూ జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ రంగంలోకి దిగిపోయారు. పర్యాటక శాఖ ద్వారానూ ఆదాయ మార్గాలను పెంచుకోవచ్చన్న భావనతో టూరిజానికి కూడా సీఎం చంద్రబాబు ఇటీవలే పరిశ్రమ హోదా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని ఆసరా చేసుకుని రంగంలోకి దిగిపోయిన దుర్గేశ్… విశాఖలో ఉత్తరాంధ్ర ప్రాంతీయ పర్యాటక సదస్సు పేరిట ఓ మూడు రోజుల సదస్సును సోమవారం విశాఖలో ప్రారంభించారు. దుర్గేశ్ నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఈ సదస్సు రెండో రోజునే మంచి ఫలితాలను ఇచ్చింది.
దుర్గేశ్ నేతృత్వంలో పర్యాటక శాఖ చేపట్టిన చర్యల కారణంగా ఈ సదస్సుకు పెద్ద ఎత్తున ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. సదస్సులో భాగంగా ప్రభుత్వం అందించిన సమాచారంతో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి కనబరచారు. ప్రాథమికంగా ఆరు ప్రాజెక్టులకు గాను ఆయా సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుల విలువ ఏకంగా రూ.1,100 కోట్లుగా ఉందని పర్యాటక శాఖ తెలిపింది. ఇక ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర యువతకు 2,500 మేర ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొంది.