ఏపీ కేబినెట్ లో టెన్షన్ టెన్షన్.. ఎందుకంటే?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ లో ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ మంత్రిని పలకరించినా.. హడావిడిగా కదిలిపోతున్నారే తప్పించి.. గతంలో మాదిరిగా ఒకింత నిలబడి సమాధానాలు చెబుతున్న వైనం అస్సలు కనిపించడం లేదు. ఏదో అత్యవసర కార్యక్రమాలు ఉన్నట్లుగా మంత్రులంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తమ కార్యాలయాలు తప్పించి… మంత్రులు బయట ఎక్కడా పెద్దగా కనిపించడమే లేదు.

మంత్రుల్లో అంతగా టెన్షన్ వాతావరణం ఎందుకు కనిపిస్తోందన్న విషయానికి వస్తే… తన కేబినెట్ లోని మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మదింపు చేస్తున్నారు. అందుకోసం ఆయా శాఖల నుంచి ఆయన ప్రత్యేకంగా నివేదికలు కోరారు. మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి డిసెంబర్ దాకా ఆయా శాఖల్లో మంత్రుల పనితీరు ఎలా ఉందన్న అంశాన్ని వివరిస్తూ నివేదికలు పంపాలని ఆయన విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ శాఖలను పర్యవేక్షిస్తూ ఉంటే… ఆయా శాఖల వారీగా మంత్రుల పనితీరును వేర్వేరుగానే పంపాలని కూడా సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రస్తుతం మంత్రులంతా ఈ నివేదికల రూపకల్పనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో పలువురు సీనియర్ మంత్రులున్నా.. చాలా మంది కొత్త వారే ఉన్నారు. మంత్రుల పనితీరు మదింపునకు సంబంధించి సీనియర్లకు ఓ మోస్తరు అవగాహన ఉన్నా.. కొత్తగా మంత్రులుగా పదవులు దక్కించుకున్న వారిలో మాత్రం ఆ నివేదికలతో తమ పరిస్థితి ఎలా మారుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇక్కడిదాకా పరిస్థితి ఓ మోస్తరుగానే ఉన్నా… ఈ నివేదికల ద్వారా మంత్రుల పనితీరును మదింపు చేసి.. పనితీరు లేని వారిపై చర్యలుంటాయని సీఎం చెప్పడంతో మొత్తం మంత్రులందరిలో టెన్షన్ నెలకొంది.