భారత గణతంత్ర దినోత్సవం నాడు ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ నేతల ఓ కీలక సమావేశం జరిగింది. పార్టీలో క్రియాశీలక సభ్యత్వం కలిగి…పలు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు బీమా సొమ్మును అందించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పార్టీ అదినేత పవన్ కల్యాణ్ హాజరు కాకున్నా… పార్టీ కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై… బాదిత కుటుంబాలకు పరిహారం చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ పార్టీకి క్రియాశీల కార్యకర్తలకే కీలకమని చెప్పారు. పార్టీ నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు లేకుంటే పార్టీనే లేదని తెలిపారు. అలాంటి పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే… వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల పలు ప్రమాదాల్లో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఆయన రూ.5 లక్షల మేర పరిహారం చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం నాదెండ్ల సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై కీలక సూచనలు చేశారు. ఈ విషయంలో సీఎం నారా చంద్రబాబునాయుడు విజన్ కు అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉందన్నారు. చంద్రబాబు విజన్ కు కట్టుబడి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో కూటమి సర్కారును బలపరిచే బాద్యత కూడా జనసేనపై ఉందన్న విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలన్నారు. పదవుల కోసం జరుగుతున్న దుష్ప్రచారాలకు దూరంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates