పార్టీ కోసం సాయిరెడ్డి ఇల్లు, ఆఫీస్ అమ్ముకున్నారా..?

వైసీపీకి బిగ్ షాక్… ఇతర పార్టీలకు ఆశ్యర్చాన్ని కలగజేస్తూ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి వ్యవహారంపై పెద్ద చర్చే నడుస్తోంది. రాజకీయాలకు ముందు చేయి తిరిగిన ఆడిటర్ గా వ్యాపారవేత్తలతో చేత ప్రశంసలు అందుకున్న సాయిరెడ్డి… వైఎస్ ఫ్యామిలీ ఆర్థిక లావాదేవీలన్నీ చక్కబెట్టారు. రాజారెడ్డితో మొదలుపెట్టుకుంటే… జగన్ దాకా… వైఎస్ ఫ్యామిలీలో మూడు తరాలకు ఆయన తన ఆడిటింగ్ సేవలను అందించారు. ఇదే విషయాన్ని నిన్నటి నిష్క్రమణ సందేశంలోనూ సాయిరెడ్డి ప్రస్తావించారు.

సరే.. సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అదేదో వ్యవసాయం చేసుకుంటాననీ చెబుతున్నారు. పాపాలన్నీ చేసి ఇప్పుడు తప్పుకుంటే సరిపోతుందా? అని టీడీపీ సీనియర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్లు హూంకరిస్తున్నారు. ఇవన్నీ భవిష్యత్తులో ఏం జరుగుతుందన్న దానిపై ఆధారపడి ఉంటాయి. అయితే గతం మార్చలేం కదా. అంటే..,. ఇప్పటిదాకా సాయిరెడ్డి చేసిన తప్పులో, ఒప్పులో చెరిగిపోవు కదా. అలాంటి వాటిలో ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

2014-19 మధ్య కాలంలో వైసీపీ విపక్షంలో ఉంది కదా. ఆ పార్టీ తరఫున మంచి నెంబర్ లోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచినా.. వారిలో చాలా మందిని టీడీపీ లాగేసింది. వెరసి అసలు 2019 ఎన్నికల దాకా వైసీపీ బతికి బట్ట కడుతుందా? అన్న అనుమానాలు కూడా రేకెత్తాయి. ఆ సమయంలో జగన్ కు సాయిరెడ్డి వెన్నంటి నడిచారు. పార్టీని ఒక్క తాటిపైకి తీసుకువచ్చి.,.. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్న జగన్ కు సాయిరెడ్డి ఎనలేని సహకారం అందించారు. ఓ వైపు జగన్ పాదయాత్రలో సాగిపోతూ ఉంటే… మరోవైపు కార్యాలయంలో కూర్చుని సాయిరెడ్డి అన్ని వ్యవహారాలనూ చక్కబెట్టారు.

ఈ క్రమంలో సాయిరెడ్డి ఏకంగా తనకున్న ఆస్తులను అమ్మేసుకుని మరీ పార్టీ కోసం కష్టపడ్డారట. ఆడిటింగ్ వ్యవహారాలను సాయిరెడ్డి చెన్నై కేంద్రంగా సాగించిన నేపథ్యంలో అక్కడే ఆయన ఇల్లు, కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ కోసం ఆ ఇంటితో పాటుగా కార్యాలయాన్ని కూడా సాయిరెడ్డి అమ్మేసుకున్నారట. అలా సాయిరెడ్డి తన ఆస్తులను అమ్ముతూ ెఉంటే… వాటిని వేరెవరో కొనలేదట… మన తెలుగు వారే ఆ ఆస్తులను కొన్నారట. అంటే… పార్టీ కోసం సాయిరెడ్డి తన ఆడిటింగ్ వృత్తిని వదులుకుని… చివరకు తన ఆస్తులను కూడా అమ్మేసుకున్నారన్న మాట.

అయినా ఈ విషయాలను ఎలా నమ్మేది అంటారా? నిజమే… ఎవరో సాదారణ వ్యక్తి చెబితే నమ్మేవాళ్లం కాదు గానీ.. ఈ విషయాన్ని స్వయానా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్న కనుమూరు రఘురామకృష్ణరాజు ఈ వెల్లడించారు. సాయిరెడ్డి ఆస్తులను కొన్నవారే రఘురామకు ఈ విషయాన్ని చెప్పారట. రాజకీయంగా సాయిరెడ్డికి రఘురామ బద్ధ విరోధి. చాలాసార్లు వీరిద్దరూ శృతి మించిపోయి బూతులను దాటి మరీ దుమ్మెత్తి పోసుకున్నారు. అయితే నిన్న సాయిరెడ్డి నిర్ణయం తెసినంతనే ఆశ్చర్యం వ్యక్తం చేసిన రఘురామ ఈ వివరాలు వెల్లడించారు. అంతేకాకుండా రాజకీయంగా సాయిరెడ్డితో తాను విభేదించి ఉండవచ్చు గానీ.. ఆయనతో తనకేమీ వ్యక్తిగత కక్షలేమీ లేవని తెలిపారు. అంతేకాకుండా ఏ రకంగా చూసినా సాయిరెడ్డి చెడు వ్యక్తి అయితే కాదని కూడా రఘురామ సర్టిఫికెట్ ఇచ్చారు.