‘ప‌ర్య‌ట‌న’ ఫ‌లితం.. ఆరు మాసాల త‌ర్వాతే!

ఏపీ స‌ర్కారు త‌ర‌ఫున సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారాలోకేష్‌లు దావోస్‌లో పెట్టుబ‌డులు దూసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఈ విష‌యంలో వారి శ్ర‌మ‌ను త‌క్కువ చేసి చూపించే ప్ర‌య‌త్నం చేయ‌లేం. కానీ, కొన్ని అనివార్య కార‌ణాల‌తో అనుకున్న విధంగా త‌క్ష‌ణ ఫ‌లితం అయితే ద‌క్క‌లేద‌న్న‌ది వాస్త‌వం. దీనికి ప‌లు కార‌ణాలు కూడా క‌నిపిస్తున్నాయి. కానీ, ఈ చ‌ర్చ‌లు, ఒప్పందాల ఫ‌లితాలు, ఫ‌లాలు కూడా వ‌చ్చే ఆరు మాసాల్లో క‌నిపిస్తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏఐ యూనివ‌ర్సిటీకి స‌హ‌కారం స‌హా.. ఐటీ రంగంలో స‌హ‌కారం విష‌యంలో బిల్ గేట్స్ సూత్ర ప్రాయంగా అంగీక‌రించారు.

అదేవిధంగా పెట్టుబ‌డులు పెట్టేందుకు గూగుల్ వంటి సంస్థ‌లు కూడా ముందుకు వ‌చ్చాయి. అదేవిధంగా టైర్ల కంపెనీలు, మాన్యుఫ్యాక్చ‌ర్ యూనిట్ల‌ను కూడా ఏర్పాటు చేసేందుకు ప‌లు కంపెనీలు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చాయి. కానీ, ఇప్ప‌టికిప్పుడు కుదిరింది.. కేవలం 15 వేల కోట్ల ఒప్పందాలు మాత్ర‌మే. దీంతో ఇది ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణ‌మ‌నే చెప్పాలి. అయితే.. వ‌చ్చే ఆరు మాసాల్లో మాత్రం వీటి తాలుకూ ఫ‌లితాలు క‌నిపిస్తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వైసీపీనే కార‌ణ‌మా?

తెలంగాణ‌తో పోల్చుకుంటే.. ఏపీకి పెట్టుబ‌డులు తగ్గాయ‌న్న‌ది వాస్త‌వం. ఈ విష‌యాన్ని రాజ‌కీయంగా కూట‌మి నేత‌లు కూడా అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో ఒప్పుకొంటున్నారు. అయితే.. దీనికికార‌ణం.. వైసీపీనే అని చెబుతున్నారు. గ‌త ఐదేళ్ల‌లో రాజ‌ధాని న‌గ‌రం అమ‌రావ‌తిని వైసీపీ పూర్తి చేసి ఉన్నా.. క‌నీసం స‌గ‌మైనా నిర్మాణాలు పూర్తి చేసి ఉన్నా.. పెట్టుబ‌డి పెట్టేవారు.. వ‌చ్చేందుకు ఉత్సాహం చూపించే వార‌ని అంటున్నారు. కానీ, ఇప్పుడే నిర్మాణాలు పుంజుకుంటున్న క్ర‌మంలో ఇవి ఆల‌స్య‌మ‌వుతున్నాయ‌ని చెబుతున్నారు.

సాధార‌ణంగా.. ఏ పెట్టుబ‌డి దారుడైనా.. త‌న‌కు అనుకూలంగా ఉన్న ప్రాంతాన్నే ఎంచుకుంటారు. కాబ‌ట్టి అన్ని విధాలా డెవ‌ల‌ప్ అయిన హైద‌రాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు.. సిద్ధ‌ప‌డ్డార‌న్న వాద‌నా వినిపిస్తోంది. అయితే.. ఏపీ ఆశ‌లు స‌న్న‌గిల్ల‌లేద‌ని.. త్వ‌ర‌లోనే పెట్టుబ‌డి దారులు ఒప్పందాలు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ ముఖ్య నాయ‌కుడు, గ‌తంలో ఆర్థిక వ్య‌వ‌హారాలు చూసిన నేత‌ ఒక‌రు వ్యాఖ్యానించారు.