ఇదే జ‌రిగితే బాబు హ‌యాం… పెట్టుబ‌డుల సంక్రాంతే..!

ప్ర‌స్తుతం స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్‌లో జ‌రుగుతున్న ప్ర‌పంచ పెట్టుబడుల స‌ద‌స్సులో సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా శ్ర‌మిస్తున్నార‌నే చెప్పాలి. పెట్టుబ‌డులు దూసుకు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో రెండు కీల‌క సంస్థ‌ల వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. ఒక‌టి.. మైక్రోసాఫ్ట్‌.. రెండోది గూగుల్‌. ఈ రెండు సంస్థ‌ల‌ను ఏపీకి తీసుకురావాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. ఇత‌ర కంపెనీలు ఎన్నో ఉన్న‌ప్ప‌టికీ.. వీటికే ఎందుకు ప్రాధాన్య‌మిస్తున్నారంటే.. దీని వెనుక చాలా వ్యూహం ఉంది.

దీనినే చంద్ర‌బాబు పాటిస్తున్నారు. గ‌తంలో హైద‌రాబాద్‌కు త‌ర‌లి వ‌చ్చేందుకు, ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు చాలా సంస్థ‌లు ముందుకు రాలేదు. ఇలాంటి స‌మ‌యంలో మైక్రోసాఫ్ట్‌ను తీసుకురావ‌డం ద్వారా.. చంద్ర‌బాబు ఇత‌ర సంస్థ‌ల విష‌యంలో స‌క్సెస్ అయ్యారు. అంటే.. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థ వ‌స్తే.. దాని వెనుక అనేక సంస్థ‌లు కూడా పుంజుకుని ముందుకు వ‌స్తాయి. త‌ద్వారా రాష్ట్రానికి మేలు జ‌రుగుతుంద‌నేది కీల‌క అంశం.

అందుకే మైక్రోసాఫ్ట్‌కు చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక‌, గూగుల్ విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికే ఏఐ విష‌యంలో గూగుల్‌తో ఒప్పందాలు చేసుకున్నారు. కానీ, ఇంత‌కుమించి అన్న విధంగా ఇప్పుడు దావోస్ వేదిక‌గా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అదేస‌మ‌యంలో గూగుల్‌తో ఒప్పందం ద్వారా పొరుగు రాష్ట్రాల‌కు పోటీ ఇవ్వాల‌నేది బాబు వ్యూహం. అందుకే మ‌రిన్ని రంగాల్లో అంటే..ఏఐ యూనివ‌ర్సి టీ., క్లౌడ్ మేనేజ్‌మెంట్‌(ఇప్ప‌టికే చేసుకున్నారు. దీనిని మ‌రింత పెంచుకోవాల‌నేది వ్యూహం).. వంటివాటిలో స‌హ‌కారం.

మొత్తంగా చూస్తే… అటు మైక్రోసాఫ్ట్‌, ఇటు గూగుల్ సంస్థ‌ల నుంచి ఒప్పందాలు జ‌రిగి.. భారీ ఎత్తున పెట్టు బ‌డులు క‌నుక వ‌స్తే.. త‌ద్వారా ఇత‌ర రంగాల నుంచి ఇత‌ర సంస్థ‌ల నుంచి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డం పెద్ద క‌ష్టం కాదు. గ‌తంలో సైబ‌రాబాద్ విష‌యంలోనూ ఇలాంటి ప్ర‌యోగం ఫ‌లించింది. కాబ‌ట్టి.. ఈ రెండు అనుకున్న విధంగా క‌నుక ఫ‌లిస్తే.. చంద్ర‌బాబు హ‌యాంలో పెట్టుబడుల సంక్రాంతి ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే నాలుగేళ్ల వ‌ర‌కు స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో మంచి భ‌విష్య‌త్తు సైతం ఉంటుంద‌ని చెబుతున్నారు.