ఈ ఎంఎల్ఏ చివరకు ఎవరికీ కాకుండా పోయాడా ?

జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ పరిస్దితిని గమనించిన వాళ్ళకు ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు (ఎస్సీ) నియోజకవర్గంలో గెలిచిన రాపాక పరిస్దితి ఇపుడు గందరగోళంలో పడిందని సమాచారం. గెలిచిన జనసేన పార్టీని కాదని వైసిపికి దగ్గరైన రాపాకకు ఇపుడు అధికారపార్టీలో ఆదరణ కరువైందట. గెలిచిన దగ్గర నుండి తన వ్యవహారశైలి కారణంగా వైసీపీకి అనుబంద సభ్యునిగానే రాపాక కంటిన్యు అవుతున్నారు. తనకు తాను వైసీపీ ఎంఎల్ఏగానే ప్రకటించేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే కొద్దిరోజులుగా నియోజకవర్గంలో రాపాక పరిస్ధితి తల్లకిందులైందని మద్దతుదారులే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలోని పనుల కోసం ఎంఎల్ఏ అధికారుల దగ్గరకు వెళ్ళినపుడు ఎవరు పెద్దగా పట్టించుకోవటం లేదట. ఒకపుడు అధికారుల దగ్గర మంచి జోరు కనబరచిన రాపాకకు ప్రస్తుతం చుక్కెదురవుతోందట. హఠాత్తుగా రాపాక పరిస్దితి ఎందుకు ఇలా దిగజారిపోయింది ? ఎందుకంటే మొన్నటి వరకు నియోజకవర్గంలోని వైసీపీ రెండు వర్గాల్లో ఒకటి ఎంఎల్ఏకు మద్దతుగా నిలబడిందట.

నియోజకవర్గంలోని బొంతు రాజేశ్వరరావు, అమ్మాజీల వర్గాలుగా అధికార పార్టీ క్యాడర్ మొత్తం చీలిపోయారు. గెలిచిన తర్వాత ఎంఎల్ఏ జగన్మోహన్ రెడ్డికి జిందాబాద్ అనటంతో అమ్మాజీ వర్గం వెంటనే రాపాకకు మద్దతుగా నిలబడింది. బొంతు వర్గం రాపాకను ఎంతగా వ్యతిరేకించినా అమ్మాజి వర్గం మద్దతుగా నిలవటంతో ఏమి చేయలేక మౌనంగా ఉండిపోయింది బొంతు వర్గం. అయితే ఈ మధ్య ఏమయ్యిందో ఏమో తెలీదు కానీ అమ్మాజీ వర్గంతో కూడా రాపాకకు చెడిందట. దాంతో అమ్మాజీ వర్గం కూడా ఎంఎల్ఏని దూరం పెట్టేసింది. ఎప్పుడైతే అమ్మాజి వర్గానికి ఎంఎల్ఏకి చెడిందన్న విషయం బయటపడిందో వెంటనే బొంతు వర్గం రాపాక పై రెచ్చిపోవటం మొదలుపెట్టింది.

వైసీపీలోని బలమైన వర్గాన్ని నమ్ముకున్న రాపాక ఇంతకాలం జనసేనలోని నేతలను కూడా దగ్గరకు రానీయలేదు. ఎందుకు రానీయలేదంటే ఎప్పటికైనా తాను వైసీపీలో కలిసిపోవాలన్నదే ఎంఎల్ఏ ఆశ. అందుకనే సొంత పార్టీ నేతలను పట్టించుకోలేదు. అయితే నమ్ముకున్న వైసీపీలోని బలమైన వర్గంతో చెడటం, అసలే తనపై మంటగా ఉన్న రెండోవర్గం రెచ్చిపోవటానికి తోడు సొంతపార్టీలోని నేతలు కూడా దూరమైపోయారట. అంటే రాపాకకు ఇఫుడు ఏ వర్గంతోను సంబంధాలు లేకుండాపోయాయి.

దాంతో నియోజకవర్గంలో తాను ఒంటరి అయిపోయిన విషయం ఎంఎల్ఏకు అర్ధమైందట. దూరమైన అమ్మాజీ వర్గంతో చేతులు కలపలేక, బొంతు వర్గం దగ్గరకు వెళ్ళలేక అలాగని సొంతవర్గంతో ఆధిపత్యం చెలాయంచలేక రాపాక నానా అవస్తలు పడుతున్నారట. మొత్తానికి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తిగా మారాయని చెప్పాలి.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)