పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రెండో రోజే ఫలితం రాబట్టారు. ఎఫ్ఎంసీజీ రంగంలో వరల్డ్ జెయింట్ గా కొనసాగుతున్న యూనీ లివర్ ను తెలంగాణకు రప్పించే దిశగా రేవంత్ రెడ్డి చేసిన యత్నాలు మంగళవారం ఫలించాయి. ఒకేసారి రాష్ట్రంలో రెండు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు యూనీ లివర్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ మంగళవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది.
న్యూజిల్యాండ్ నగరం దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఇతర అధికారులతో కలిసి దావోస్ వెళ్లిన రేవంత్ మంగళవారం మధ్యాహ్నం యూనీలివర్ సీఈఓ హీన్ షూమాచర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పామాయిల్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న సానుకూల అంశాలను రేవంత్ ఆయన ముందు పెట్టారు. అంతేకాకుండా బాటిల్ క్యాప్ ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరించారు. బాటిల్ డబుల్ క్యాప్ లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వైనాన్ని రేవంత్ వారికి వివరించారు. సదరు ప్లాంట్ తెలంగాణలోనే ఉంటే… యూనీ లివర్ కు ఒనగూరే ప్రయోజనాలను విశదీకరించారు.
రేవంత్ ప్రజెంటేషన్ ను విన్న హీన్ షూమాచర్… పామాయిల్ తయారీ ప్లాంట్ తో పాటు బాటిల్ డబుల్ క్యాప్ తయారీ ప్లాంట్ ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సమ్మతించారు. కామారెడ్డి జిల్లాలో యూనీ లివర్ పామాయిల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఇక బాటిల్ డబుల్ క్యాప్ తయారీ ప్లాంట్ కోసం అనువైన ప్రాంతాన్ని తెలంగాణ సర్కారు ఎంపిక చేయాల్సి ఉంది. అతి త్వరలోనే ఈ రెండు ప్లాంట్లను యూనీ లివర్ తెలంగాణలో ఏర్పాటు చేయనుంది.
ఈ ప్లాంట్ల ఏర్పాటు కోసం యూనీ లివర్ ఎంత మేర నిధులను ఖర్చు చేయనుందన్న వివరాలు అయితే వెల్లడి కాకున్నా… తయారీ ప్లాంట్ల ఏర్పాటుపై మాత్రం ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదిరింది. ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాల ఎంపిక జరగ్గానే.. ఇరు వర్గాల మధ్య ఈ మేరకు ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయి. యూనీలివర్ తయారీ ప్లాంట్లు తెలంగాణకు వస్తున్నందున.. భవిష్యత్తులో రాష్ట్రానికి ఆ సంస్థ నుంచి మరింత మేర పెట్టుబడులు రానున్నాయని చెప్పక తప్పదు.