మోడీ – చిరంజీవి ఒకే వేదిక‌పై.. ఎక్క‌డ‌? ఎందుకు?

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ-మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదిక‌పై క‌నిపించిన ప‌రిస్థితి ఇటీవ‌ల కాలంలో ఎక్క‌డా లేదు. ఎప్పుడో ప్రమాణస్వీకార మహోత్సవ దినాన ఒక్క సారి మాత్ర‌మే ఇరువురు క‌లిసి పాల్గొన్నారు. అయితే.. తాజాగా చిరంజీవి, మోడీలు సంయుక్తంగా పాల్గొన్న‌కార్య‌క్ర‌మం తాలూకు చిత్రాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

ఏపీలో అధికార‌భాగ‌స్వామ్య పార్టీ జ‌న‌సేన‌తో మోడీకి ఉన్న అనుబంధం తెలిసిందే. జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను మోడీ కొనియాడ‌డం.. ఆయ‌న‌ను మెచ్చుకోవ‌డం తెలిసిందే. అయితే.. తాజాగా చిరంజీవి-మోడీలు ఒకే వేదిక‌పై క‌లుసుకున్నారు.

సంక్రాంతి సంబ‌రాల‌ను పుర‌స్క‌రించుకుని తెలంగాణ నాయ‌కుడు, కేంద్ర మంత్రి, బీజేపీ నేత గంగాపురం కిష‌న్ రెడ్డి ఢిల్లీలోని త‌న నివాసంలో సంబ‌రాలు ఏర్పాటు చేశారు. సోమ‌వారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఈ సంబ‌రాల‌కు.. అనేక మంది ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించారు.

వీరిలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా, టెన్నిస్ స్టార్ సింధు, తేజ సజ్జా, గాయ‌ని సునీత స‌హా తెలంగాణ‌, ఏపీల‌కు చెందిన అనేక మంది ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇదే కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి కూడా హాజ‌ర‌య్యారు. అయితే.. అంద‌రిలో ఒక‌డిలా కాకుండా.. చిరుకు ప్ర‌త్యేక గౌర‌వం ద‌క్కింది.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. చిరును చూడ‌గానే ప‌ల‌క‌రించి ఆత్మీయ ఆలింగ‌నం చేసుకున్నారు. అనంత‌రం కార్య‌క్ర‌మానికి సంబంధించిన జ్యోతి వెలిగించే విష‌యంలోనూ చిరుకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్ర‌ధాని మోడీ తొలుత ఒక ఒత్తి వెలిగించ‌గా.. చిరంజీవి రెండో ఒత్తిని వెలిగించారు. ఈ స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ ప‌లు సూచ‌న‌లు కూడా చేయ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. చిరుతో పాటు న‌డుచుకుంటూ.. త‌మ‌కు ఏర్పాటు చేసిన ఆస‌నాల్లో కూర్చొన్నారు. ప‌క్క‌ప‌క్క సీట్ల‌లోనే కూర్చుని కార్య‌క్ర‌మాల‌ను ఆస్వాదించారు. మొత్తానికి ప‌వ‌న్‌తోనే కాకుండా.. చిరుతోనూ మోడీ బాండింగ్ పెంచుకుంటున్నార‌న్న చ‌ర్చ తెర‌మీదికి రావ‌డం విశేషం.