జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఉంది. మోడీ ప్రభావం, బీజేపీ దూకుడుతో పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. ఇక, అధికారం చేరువ అవుతుందన్న రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కుదేలైన పరిస్థితి కనిపించింది. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణలో మాత్రమే అతి కష్టం మీద విజయం దక్కించుకుని పాలన సాగిస్తోంది.
ఈ క్రమంలోనే మోడీపై యుద్ధానికి బీజేపీని వెనక్కి నెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఇతర చిన్నా చితకా పార్టీల తో కలిసి `ఇండియా` కూటమిగా ఏర్పడింది. దీంతో కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు భరోసాగా చెప్పుకొచ్చింది.
కానీ, ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే.. గతం కంటే కొంత మెరుగు అన్నట్టుగా కొంత మేరకు సీట్ల విషయంలో పుంజుకుని ప్రధాన ప్రతిపక్ష హోదాను మాత్రం దక్కించుకుంది.
ఇక, ఆ తర్వాత రాష్ట్రాల విషయానికి వస్తే.. కాంగ్రెస్ దూకుడు కూటమి పార్టీలకు తలనొప్పి తెచ్చింది. దీంతో ఆయా పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను పక్కన పెట్టాయి. ఫలితంగా కాంగ్రెస్ ఒంటరి అవుతూ వచ్చింది. తాజాగా ఇది మరింత పెరిగింది.
ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇక్కడి అధికార పార్టీ ఆమ్ ఆద్మీ.. ఒంటరిగానే ప్రయాణానికి రెడీ అయింది. వాస్తవానికి ఆప్.. కాంగ్రెస్‌కు అత్యంత మిత్రపక్షం. కానీ, ఢిల్లీ స్థాయిలో మాత్రం వైరిపక్షంగా మారింది.
ఇప్పుడు ఏం జరిగిందంటే.. ఇండియా కూటమిలోని కాంగ్రెసేతర పార్టీలు గుండుగుత్తగా.. (ఒక్క జేఎంఎం మినహా) ఆప్‌కు మద్దతు ప్రకటించాయి. కీలకమైన తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ వంటి అధిక స్థాయిలో ప్రజాబిమానం ఉన్న పార్టీ ఆప్ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు మద్దతు ఇస్తున్నట్టు సంచలన ప్రకటన చేయడం గమనార్హం.
దీంతో ఇప్పుడు జాతీయస్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభావం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వపై పడనుందని అంటున్నారు పరిశీలకులు.