ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు ఎదురు పడితే ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది? అదే గురువారం సాయంత్రం జరిగింది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో పరామర్శిం చారు. వారి ఆవేదనను పంచుకున్నారు.
అయితే.. ఇదేసమయంలో బాధితులను పరామర్శించేందుకు ప్రత్యేక వాహనంలో జగన్ కూడా స్విమ్స్‌కు చేరుకున్నారు. అప్పటికే పవన్ కల్యాణ్.. మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఉన్నట్టుండి జగన్ రావడంతో పాటు ఆయన వెంట అనుచరులు కూడా భారీ సంఖ్యలో వచ్చారు. వీరిని చూసిన జనసేన నాయకులు.. జై పవన్ నినాదాలతో హోరెత్తించారు. ఇక, వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా.. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఈ పరిణామంతో పోలీసులు హడలిపోయారు.
ఏం జరుగుతుందోనని గుండెలు చిక్కబట్టుకుని కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమం లో స్విమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతుండగా వైసీపీ అధినేత జగన్ అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరుపార్టీల నినాదాలతో హాస్పిటల్ ప్రాంగణం హోరెత్తుతోంది. అరగంట ఆలస్యంగా రావాలని చెప్పినా వినకుండా జగన్ అక్కడికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు.
అయితే.. జగన్ తన కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ సైతం తన పార్టీ కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. మరోవైపు పోలీసులు జగన్ ను వేరే మార్గం గుండాలోనికి పంపించారు. పవన్ కల్యాణ్ తన మీడియా సమావేశాన్ని అర్థంతరంగా ముగించి వెనుదిరిగారు. దీంతో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు.