కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు… దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తిరుమల వస్తున్నారు. స్వామి వారిని ఎంచక్కా దర్శించుకుంటున్నారు. స్వామి వారి దర్శన భాగ్యం కలిగిందన్న సంతృప్తితో తిరిగి వెళుతున్నారు. అయితే తిరుమల చరిత్రలో ఇప్పటిదాకా తోపులాటలు జరిగి భక్తులు చనిపోయిన ఘటనలు లేవనే చెప్పాలి. ఏటికేడు తిరుమల వస్తున్న భక్తుల సఖ్య పెరుగుతున్నా… అందుకు తగ్గ ఏర్పాట్లను చేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. వైకుంఠ ఏకాదశి సహా స్వామి వారి బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నా… ఎక్కడా ప్రమాదాలు చోటుచేసుకున్న దాఖలా కనిపించలేదు. అయితే ఈ దఫా మాత్రం ఊహించని విధంగా తిరుపతిలో తోపులాట జరగడం, ఏకంగా ఆరుగురు భక్తులు చనిపోవడం బాధాకరం.
అయినా ఇప్పుడు వెంకన్న దర్శనానికి సంబంధించి ప్రతి సందర్భానికీ ప్రత్యేక దర్శనాలు ఉంటున్నాయి. వాటికి సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లోనే విడుదల చేస్తున్నారు. ఇందుకోసం టీటీడీ ఓ ప్రత్యేక వెబ్ పోర్టల్ నే నిర్వహిస్తోంది. స్వామి వారి శీఘ్ర దర్శనం కోస నిత్యం భక్తులు ఈ ఆన్ లైన్ లో టికెట్లు కొనే తిరుమలకు వస్తున్నారు. స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి కొండపై కావాల్సిన వసతి సౌకర్యాలను కూడా ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. వెరసి ఆన్ లైన్ లో వెంకన్న దర్శన టికెట్ల జారీని భక్తులు స్వాగతిస్తున్నారనే చెప్పాలి. గతంలో స్వామి వారి దర్శన టికెట్లను బ్లాక్ చేసి అక్రమాలకు పాల్పడుతున్నారన్న వాదనలు వినిపించేవి. అయితే ఇటీవలి కాలంలో ఈ తరహా అక్రమాలకు అసలు ఆస్కారమే లేకుండాపోయింది. టీటీడీ తీసుకున్న పటిష్ట చర్యలే ఇందుకు నిదర్శనని చెప్పక తప్పదు.
స్వామి వారి ఇతర సేవల మాదిరే…వైకుంఠ ద్వార దర్శన టికెట్లను కూగా 2022 కు ముందు ఆన్ లైన్ లోనే విడుదల చేసేవారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక… 2022లో వైకుంఠ ద్వార దర్శనాలను మరింత మంది భక్తులకు కల్పంచాలని టీటీడీ తలచింది. ఆ మేరకు టికెట్లను ఆన్ లైన్ లోనే జారీ చేస్తే సరిపోయేది. అందుకు విరుద్ధంగా వ్యవహరించిన టీటీడీ… 2022లో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టోకెన్లను ఫిజికల్ గా జారీ చేయాలని తీర్మానించింది. ఇందుకోసం అటు తిరుమలతో పాటుగా ఇటు తిరుపతిలోనూ టోకెన్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేసింది.అంతేకాకుండా 2022 కు ముందు రెండు రోజుల పాటు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలను అమలు చేసిన టీటీడీ.. ఆ తర్వాత 10 రోజుల పాటు ఆ దర్శనాలను కల్పించాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది.
వైకుంఠ ద్వారం ద్వారా వెంకన్నను దర్శించుకోవాలని కోరుకోని భక్తులు ఉండరనే చెప్పాలి. ఈ లెక్కన టీటీడీ చేసిన ప్రచారంతో భక్తులు గడచిన మూడేళ్లుగా వైకుంఠ ద్వార దర్శనం కోస తిరుమలకు తండోపతండాలుగా వస్తున్నారు. ఈ క్రమంలో ఈ తరహా టోకెన్లను జారీ చేసిన తొలి ఏడాదే తోపులాట చోటుచేసుకుంది. అయితే నాడు భక్తులెవరూ చనిపోలేదు. దీంతో భక్తులు ఎక్కువసంఖ్యలో తరలివస్తే… ఒకింత తోపులాటలు సహజమేనన్న ధోరణితో టీటీడీ దీనిని సీరియస్ గా పరిగణించలేదు. ఆ తర్వాత 2023, 2024 లలో కూడా స్వల్ప స్థాయిలో తోపులాటలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ ఏడాది గతంలో ఎన్నడూ రానంత స్థాయిలో భక్తులు ఒకేసారి తిరుమల రావడంతో ప్రాణాలు పోయే ప్రమాదం తప్పలేదు. ఇప్పటికైనా అందుబాటులో ఉన్న ఆన్ లైన్ టికెట్ల జారీ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలను కూడా కేటాయిస్తే… ఈ తరహా ప్రమాదాలను నివారించవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.