తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. నిన్న మొన్నటి వరకు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, జయలలితకు అత్యంత విధేయుడిగా పేరొందిన ఒ. పన్నీర్ సెల్వం.. తాజాగా కమలం పార్టీకి షాకిచ్చారు. అధికార పార్టీ డీఎంకేలో చేరిపోయారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో ఆయన కండువా కప్పుకొన్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో రాజకీయాలను కీలక మలుపు తిప్పనుందని పరిశీలకులు చెబుతున్నారు.
పన్నీర్ సెల్వం సామాజిక వర్గం పరంగానేకాకుండా.. పాలన పరంగా కూడా.. తమిళనాడు ప్రజలపై బలమైన ముద్ర వేశారు. తొలినాళ్లలో ఆయన అన్నాడీఎంకేకు అనుబంధంగానే పనిచేశారు. జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఆమెకు ఎప్పుడు అవసరం అయినా.. ముఖ్యమంత్రి పీఠంపై ఆయన కూర్చున్నారు. అంతటి విధేయతను ప్రజలపై కూడా చూపించారు. దీంతో పన్నీర్ సెల్వం పట్ల తమిళులకు ఎనలేని అభిమానం ఉంది.
ఇప్పుడు ఎన్నికల వేళ.. ఆయన బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం ప్రయత్నించారు. కానీ, బీజేపీ ఈ విషయంలో తాత్సారం చేయడంతోపాటు.. అన్నాడీఎంకే అధినేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి పళని స్వామిని తమకు అనుబంధ కూటమిలో చేర్చుకుంది. దీంతో స్టాలిన్ పిలుపు మేరకు పన్నీరు సెల్వం ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది.. కీలకమైన ద్రవిడ ఓటు బ్యాంకును స్టాలిన్‌కు మరింత చేరువ చేస్తుందన్న చర్చ సాగుతోంది.
2022 నుంచి..
వాస్తవానికి 2022లోనే అన్నాడీఎంకే పార్టీ నుంచి సెల్వం బయటకు వచ్చారు. ఆ సమయంలోనే ఆయన బీజేపీ పగ్గాల కోసం ప్రయత్నం చేశారు. కానీ, అవకాశం చిక్కలేదు. అయినా వేచి ఉన్నారు. ఇక, తనకు అవకాశం రాదని భావించి.. తాజాగా తనకుమారుడు, మాజీ ఎంపీ రవీంద్రతో పాటు.. పలువురు ఎమ్మెల్యేలతో డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామంతో జయలలిత అభిమానులు సంబంరాలు చేసుకోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates