ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు తెలిపారు. తాను ఈ కేసులో టార్గెట్ అయ్యానని వ్యాఖ్యానించారు. తాను రాజకీయ బాధితురాలినని పేర్కొన్నారు. ఒకరిపై ఉన్న అక్కసుతో నాపై కేసు బనాయించి.. జైలుకు తరలించారని ఆమె పరోక్షంగా బీఆర్ ఎస్ అధినేతపై వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయం పావుగా మారానన్నారు.
అయితే.. అప్పట్లోనే తాను.. కడిగిన ముత్యంగా బయటకు వస్తానని చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు అదే జరిగిందన్నారు. తనకు సంబంధం లేకపోయినా.. తనను ఇరికించారని, జైలు పాలు చేశారని అన్నారు. అయితే.. ఇప్పటికైనా దేవుడు తనయందే ఉండి తనను ఈ కేసు నుంచి బయట పడేశాడని వ్యాఖ్యానించారు. ఇక నుంచి మరింత ఉత్సాహంతో ప్రజల మద్యకువెళ్తానని కవిత చెప్పారు. ఈ కేసు విషయంలో తనకు ముందు నుంచి మద్దతు తెలిపి వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల మధ్యే ఉంటా!
ఇక నుంచి తాను ప్రజల మధ్యే ఉంటానని కవిత చెప్పారు. ఇప్పటి వరకు తనపై అభాండాలు మోపి.. తనను ప్రజల మధ్య చులకన చేసిన రాష్ట్ర బీజపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రజలతోనే ఇక నుంచి తన జీవితం ముడి పడి ఉంటుందన్నారు. త్వరలోనే సొంత పార్టీకి సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడించనున్నట్టు తెలిపారు. మేలోనే పార్టీ పెడతానని ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఇక నుంచి ప్రజల మధ్యే ఉంటానని చెప్పడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates