ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆయన లక్ష్యాలు తమవిగా భావిస్తామని చెప్పారు. విశాఖ పర్యటనలో భాగంగా 2.3 లక్షల కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడా రు. తొలుత తెలుగులోనే ఆయన ప్రసంగం ప్రారంభించారు. అనంతరం హిందీలో కొనసాగించారు. హిందీ అనువాదం కేంద్ర మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ఏపీని అభివృద్ది చేసే బాధ్యతను తాము తీసుకుంటామని చెప్పడం గమనార్హం.
ఏపీ ప్రజల ఆశయాలను నెరవేరుస్తామని ప్రధాని మోడీ తెలిపారు. అన్ని విధాలా ఏపీకి మద్దతుగా ఉంటామన్నారు. ఏపీతో అన్ని రంగాల్లోనూ కలిసి ముందుకు సాగుతామన్నారు. బుధవారం శంకుస్థాపనలు చేసిన, ప్రారంభించిన పలు ప్రాజక్టులు ఏపీకి అన్ని విధాలా దోహద పడతాయని, అభివృద్ధి పథంలో రాష్ట్రాన్నిముందుండి నడిపిస్తాయని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుందని పేర్కొన్నారు. ఏపీలో ఐదేళ్ల తర్వాత.. తిరిగి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిందన్న మోడీ.. అభివృద్ధికి చిరునామాగా మార్చేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. ఈ విషయంలో ఏపీ ప్రజలకు మోడీ హామీ
ఇస్తున్నారని చెప్పారు.
చంద్రబాబుపై పొగడ్తలు..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. దార్శనికతకు సీఎం చంద్రబాబు మారుపేరుగా పేర్కొ న్నారు. ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నా.. దేశం గురించి ఆలోచించే అతి తక్కువ మంది నాయకుల్లో ముందుంటారని తెలిపారు.
ఆయన సీఎం కావడం.. ఏపీ చేసుకున్న అదృష్టంగా పేర్కొన్నారు. నిరంతరం ఆయన రాష్ట్రం కోసం.. ప్రజల కోసం ఆలోచిస్తు న్నారని తెలిపారు. ప్రతి రంగంలోనూ అభివృధ్ధి సాధించాలని కలలు కంటున్నారని, ఆయనకు అన్ని విధాలా అండగా ఉంటామ ని తెలిపారు. చంద్రబాబు తన ప్రసంగంతో ఇరగదీశారని కొనియాడారు.
వరాలు ఇవే..
ఏపీకి ప్రధాని ఇచ్చిన వరాల ప్రాజక్టులు ఇవీ..
- దేశంలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు వస్తుంటే.. అందులో ఒకటి విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు.
- గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా లక్షల మందికి ఉపాధి లభించనుంది.
- అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు.
- దేశంలోని మూడు రాష్ట్రాల్లో బల్క్ డ్రగ్ పార్కులు వస్తుంటే.. ఒకటి ఏపీకి కేటాయించారు.
- చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో క్రిస్ సిటీ ఏర్పాటు కానుంది.
- దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేశారు.
- రైల్వే జోన్ తో వ్యవసాయ, పర్యాటక రంగాలు పుంజుకోనున్నాయి.