కుప్పానికి వ‌స్తే.. ఆయుష్షు పెరిగేలా చేస్తా: చంద్ర‌బాబు

ప్ర‌స్తుతం ఐటీ రంగంలో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం దేశ‌వ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు బెంగ‌ళూరుకు క్యూ క‌డుతున్నార ని.. భ‌విష్య‌త్తులో కుప్పానికి వ‌చ్చేలా చేస్తాన‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. మంగ‌ళ‌వారం రాత్రి ఆయ‌న కుప్పంలో జ‌న నాయ కుడు పేరుతో నిర్వ‌హించిన స‌భ‌లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా కుప్పంపై అనేక వ‌రాలు కురిపించారు. 2029 నాటికి కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆద‌ర్శవంత‌మైన నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్ద‌నున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం చ‌దువుకు, ఉద్యోగాల‌కు కూడా బెంగ‌ళూరు డెస్టినేష‌న్‌గా ఉంది. కానీ, రాబోయే రోజుల్లో కుప్పాన్ని డెస్టినేష‌న్‌గా మారుస్తాం అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ఇక్క‌డ‌కు అనేక విదేశీ విద్యాసంస్థ‌ల‌ను కూడా ఆహ్వానించ‌నున్న‌ట్టు తెలిపారు. అదేవిధంగా యూనివ‌ర్సిటీలు, నైపుణ్య విద్యా సంస్థ‌ల‌ను కూడా పెంచ‌నున్న‌ట్టు చెప్పారు. అదేవిధంగా అత్యంత నివాసయోగ్యమైన(వెరీ సేఫ్ లివింగ్ ప్లేస్‌) ప్రదేశంగా కూడా నియోజ‌క‌వ‌ర్గాన్ని తీర్చిదిద్ద‌నున్న‌ట్టు సీఎం చెప్పారు.

మెరుగైన వైద్య కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని.. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల ను ఎప్ప‌టిక‌ప్పుడు అంచ‌నా వేసి.. వాటికి అనుగుణంగా తీర్చిదిద్ద‌నున్న‌ట్టు తెలిపారు. బెంగ‌ళూరుకు వ‌చ్చే వారికంటే కూడా కుప్పానికి వ‌చ్చే వారి సంఖ్య పెరిగేలా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్టు తెలిపారు.

ఆయుష్సు పెంచుతా!

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. “చాలా మంది బెంగ‌ళూరును ఎంచుకోవ‌డానికి కార‌ణం.. అక్క‌డ ఉండే ప‌చ్చ‌ద‌నం, వాతావ‌రణం. త‌ద్వారా వారిఆయుష్సు పెరుగుతుంద‌న్న న‌మ్మకం. సో.. ఇక నుంచి కుప్పంలోనూ ఇలాంటి ప‌రిస్థితిని క‌ల్పిస్తా.

కుప్పం వ‌స్తే కూడా.. ఆయుష్షు పెరుగుతుంద‌న్న భావ‌న పెరిగేలా చేస్తా. 20 నుంచి 30 ఎళ్ల ఆయుష్షు పెరిగేలా చ‌ర్య‌లు తీసుకుంటా“ అని వ్యాఖ్యానించారు. కుప్పం నియోజ‌క‌వ‌ర్గం అంటే.. క‌డిగిన అద్దంలా మార్చుతాన‌ని హామీ ఇచ్చారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిశుభ్ర‌త‌, పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రులు, సోలార్ విద్యుత్తు.. ఇలా అనేక రూపాల్లో కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో మార్పులు చోటు చేసుకుంటాయ‌ని తేల్చి చెప్పారు.