వైసీపీ హయాంలో జగన్ విద్యార్థులకు గోరుముద్ద నుంచి అమ్మఒడి వరకు అన్నీ ఇచ్చారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని జగన్ ఆపేసారని ఎంతమందికి తెలుసు? 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది.
అయితే, జగన్ అధికారంలోకి రాగానే అమ్మఒడి ఇస్తున్నాం కదా..ఇక, మధ్యాహ్న భోజనం ఎందుకు అని ఆ పథకాన్ని రద్దు చేశారు. ఇంటర్ విద్యార్థుల నోటికాడి కూడు లాగేశారు అని అప్పట్లో ఘాటు విమర్శలే తలెత్తాయి. ఈ క్రమంలోనే యువగళం పాదయాత్ర సందర్భంగా ఆ పథకం అమలు చేయాలని నారా లోకేశ్ ను విద్యార్థులు కోరారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పథకం అమలు చేస్తామని లోకేశ్ హామీనిచ్చారు.
అన్న మాట ప్రకారం లోకేశ్ ఈ రోజు నుంచి ఇంటర్ విద్యార్థులకు ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’’ ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను విద్యా వ్యవస్థతో ముడిపెట్టవద్దని లోకేశ్ అన్నారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తమ ఫొటోలు లేవని, తమ పార్టీ రంగులు లేవని లోకేశ్ గుర్తు చేశారు. విద్యార్థులకు సంబంధించిన పథకాలలో మమోన్నత వ్యక్తుల పేర్లు పెట్టామని, గత ప్రభుత్వం మాదిరిగా కాదని చెప్పారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ స్కూల్ కిట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పేర్లు పెట్టామని అన్నారు. స్కూళ్లు, కాలేజీలలో జాబ్ మేళాలు తప్ప మరే ఇతర కార్యక్రమాలు జరగకుండా ఆదేశాలిచ్చామని అన్నారు. ఇక, టీచర్లపై కూడా యాప్ ల భారం పూర్తిగా తగ్గిస్తామని తెలిపారు. వైసీపీ హయాంలో స్కూల్, కాలేజ్ విద్యార్థులను మీటింగులకు తరలించేవారని, ఇకపై అలా జరగకుండా ఆదేశాలిచ్చానని లోకేశ్ అన్నారు.
ఇంటర్మీడియట్ ఎంతో కీలకమైన దశ అని, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని అన్నారు. విద్యార్థులలో ఒక్కడిగా తనను భావించి సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పారు. ఏపీలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఈ ఏడాదికి రూ. 29.39 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి మరో రూ. 85.84 కోట్ల నిధులు ఈ పథకం కోసం కేటాయించారు. ఈ క్రమంలోనే జగన్ మామయ్యకు..లోకేశ్ అన్నయ్యకు ఇదే తేడా! అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జగన్ మామయ్య రంగుల రాజకీయాలకు అనుకూలంగా ఉన్నారని, కానీ, లోకేశ్ అలా కాదని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం తీసేసి జగన్ సున్నం పెడితే..లోకేశ్ అన్నం పెట్టారని అంటున్నారు.