6న ఏసీబీ..7న ఈడీ విచారణకు కేటీఆర్

ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా..ఆయనను అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. అయితే, విచారణ జరపవచ్చని ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

కేటీఆర్ పాటు హెచ్‌ఎండీఏ విశ్రాంత చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ లకూ నోటీసులు జారీ అయ్యాయి. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని విచారణ జరపబోతున్నారని తెలుస్తోంది.

మరోవైపు, ఈ నెల 7న విచారణకు రావాలని కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ లను జనవరి 2,3 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం లేకుండానే ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే నిధులు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఏసీబీ ఎఫ్ ఐఆర్ ఆధారంగా పీఎమ్ఎల్ చట్టం కింద ఈడీ విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్ఈవోకు 55 కోట్లు నగదు బదిలీ అయిందని ఈడీ గుర్తించింది. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఆర్థికపరమైన అవకతవలు జరిగాయని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.