భారత ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది నవంబరు 29న విశాఖలో పర్యటించాల్సి ఉండగా..తుపాను హెచ్చరికల నేపథ్యంలో అది రద్దయ్యింది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో లక్ష మందితో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించి భారీ ఏర్పాట్లు కూడా చేశారు. విశాఖకు తుపాను ముప్పు ఉండడంతో ఆ పర్యటన రద్దయింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ పర్యటన ఈ ఏడాది జనవరి 8న జరగనుంది.
ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులతో పర్యటన గురించి ఆయన సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో పలువురు కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 8న ఢిల్లీ నుంచి విశాఖకు ప్రధాని మోడీ రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకు విశాఖ విమానాశ్రయానికి మోడీ చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి భారీ భద్రత నడుమ ఆంధ్రా యూనివర్సిటీ చేరుకోబోతున్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రైల్వే జోన్ పరిపాలనా భవనాల నిర్మాణానికి వర్చువల్ గా శంకు స్థాపన చేస్తారు. ఆ తర్వాత కూటమి నేతలు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates