ప్రవాసులకు సవాలుగా మారిన ఆస్తుల నమోదు

తెలంగాణ రాష్ట్రంలోని వారంతా తమ ఆస్తుల్ని నమోదు చేసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం పిలుపునివ్వటం.. అందుకోసం భారీ కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. వ్యవసాయేతర ఆస్తుల్ని నమోదు చేసుకుంటే.. వారికి బ్రౌన్ కలర్ బుక్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా ఆన్ లైన్ లోనూ.. ఆఫ్ లైన్ లోనూ అవకాశం ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది. స్థానికులు పలువురికి ఆస్తుల నమోదులో బోలెడన్ని సందేహాలు వస్తుంటే.. విదేశాల్లో ఉన్న వారు.. అక్కడే స్థిరపడిన ప్రవాసుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందని చెబుతున్నారు.

ఎందుకంటే.. ఏళ్లకు ఏళ్లు విదేశాల్లో స్థిరపడిన వారిలో చాలామందికి ఆధార్ కార్డులు లేవు. అలాంటి వారి ఆస్తుల నమోదు సంగతి ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఆస్తుల నమోదుకు ఆధార్ తప్పనిసరి. ప్రవాసుల్లో ఆధార్ లేని వారి ఆస్తుల్ని ఎలా నమోదు చేసుకోవాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. తెలిసిన వారి ద్వారా సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారికి అధికారులు సైతం స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.

ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అయితే ఆధార్ లేని ప్రవాసుల ఆస్తుల్ని నమోదు చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఓవైపు ఆన్ లైన్ పోర్టల్ ఓపెన్ కావటం లేదన్న ఫిర్యాదులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గడువు తేదీ చెప్పి మరీ ఆస్తుల నమోదును పూర్తి చేయాలని చెబుతున్న ప్రభుత్వం మాటలు ప్రవాసులకు .. మరికొందరికి చుక్కలు చూపిస్తున్నాయని చెప్పక తప్పదు.