పదవులు చాలానే ఉంటాయి. కానీ.. వాటిని ఎవరైతే చేపడతారో.. వారికి అనుగుణంగా ఆ పదవులకు కళ రావటమో.. ఉన్న కళ పోవటమో జరుగుతుంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు చాలానే ఉన్నారు. కానీ.. మిగిలిన వారెవరికి దక్కని గౌరవం.. మర్యాదతో పాటు.. పవర్ ఉన్న ఏకైక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రమేనన్న మాట అంతకంతకూ ఎక్కువ అవుతుంది. ఏ మాటకు ఆ మాటే.. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పవర్ ఫుల్లే.
కాకుంటే.. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో పవర్ ను చూపిస్తున్నారు కానీ.. తమ రాజకీయ ప్రత్యర్థులపై చూపించాల్సిన పవర్ విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విషయానికి వస్తే.. పనుల విషయం మొదలుకొని.. ఏ సంచలన ఘటన చోటు చేసుకున్నా వెంటనే స్పందిస్తున్నారు. ఇక.. తన వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన ఇటీవల చోటు చేసుకున్న ఘటనపై ఆయన నిప్పులు చెరగటమే కాదు.. తానెంత పవర్ ఫుల్ అన్న విషయాన్ని చేతల్లో చూపుతున్న వైనం ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి కడప జిల్లాకు చెందిన గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డిపై చర్యల విషయంలో ఆయన సీరియస్ గా ఉన్నారు.ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఓవైపు దాడికి పాల్పడిన సుదర్శన్ రెడ్డిని సంచలన రీతిలో అరెస్టు చేసేందుకు ఆదేశాలు జారీ చేయటమే కాదు.. తనకు తాను నేరుగా దాడికి గురైన జవహర్ బాబును పరామర్శించటం.. వారి కుటుంబాన్ని ఓదార్చారు. అంతేకాదు.. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ధైర్యాన్ని ఇచ్చారు.
తాను రిటైర్ అయ్యాక కూడా చంపేస్తామంటూ వైసీపీ నేతలు కొందరు వార్నింగ్ ఇస్తున్న వైనాన్ని పవన్ ద్రష్టికి తీసుకెళ్లగా.. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవటమే కాదు.. అలాంటి వారి సంగతి తేల్చాలన్న విషయాన్ని పోలీసులకు తేల్చినట్లుగా చెబుతున్నారు. ఎంపీడీవోపై దాడికి పాల్పడి.. పరారీలో ఉన్న నిందితులందరిని పట్టుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించటమే కాదు.. ఆ విషయంలో తానెంత కచ్చితంగా ఉన్నానన్న విషయాన్ని పవన్ స్పష్టం చేసినట్లుగాచెబుతున్నారు.
తాను నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖకు సంబంధించిన అంశాలపై ఎంత క్లియర్ గా ఉన్నారో..ఎంపీడీవోపై దాడికి పాల్పడిన వారి సంగతి చట్టప్రకారం తేల్చాలన్న దానిపైనా అంతే పట్టుదలగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా ఒక సంచలన ఘటన జరిగిన వెంటనే ఆదేశాలు ఇచ్చి.. మీడియాతో మాట్లాడి ఊరుకోకుండా క్షేత్రస్థాయికి రావటం.. సంఘటన పూర్వాపరాలు తెలుసుకోవటం.. ఇష్యూ బ్యాక్ గ్రౌండ్ వెనుక ఉన్న అంశాల మీద అవగాహన పెంచుకోవటం చూస్తే.. మరే డిప్యూటీ సీఎం వ్యవహరించనంత పవర్ ఫుల్ గా పవన్ వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates