సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం. దీనిపై ఆధారపడి దాదాపు 80 లక్షల ఓట్లు ఉన్నాయి. వీరిలో దివ్యాంగులు , వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు.. ఇలా అనేక వర్గాలు ఉన్నాయి. ఇలాంటి సెన్సిటివ్ అంశాన్ని ఆలంబనగా చేసుకునే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి సర్కారు విజయం దిశగా దూసుకుపోయింది. పించన్లను రూ.4000లకు పెంచుతామన్న హామీ బాగా వర్కవుట్ అయింది.
అంతేకాదు.. ఇచ్చిన హామీకి కట్టుబడి కూటమి సర్కారు కూడా.. వెంటనే పింఛను పెంచింది. ఇంటికే తెచ్చి ఇస్తోంది. దీనివల్ల చంద్రబాబు కు మైలేజీ కూడా పెరిగింది. ఆయన ఏం చేస్తున్నారు? అనేది సెకండరీ అయిపోయింది. కానీ, ఇప్పుడు పింఛన్ల వ్యవహారం.. ఎన్నికలకు ముందు ఎలా అయితే.. టాక్ ఆఫ్‌ది ఇంట్రస్ట్ అయిందో.. ఇప్పుడు ప్రజల్లోనూ ఇదే చర్చ సాగుతోంది. తమ పింఛను ఉంటుందో ఉండదో ? అనే చర్చ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ వినిపిస్తోంది.
“పింఛను పెంచకపోయినా.. ఫర్వాలేదు.. మా పింఛను మాకు ఉంటే చాలు!” అనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. పింఛన్ల ఏరివేతకు సీఎం చంద్రబాబు పట్టుబట్టడం. అనర్హులు తీసుకుంటున్నారని.. వారిని ఏరివేయాలని ఆయన పదే పదే చెబుతున్నారు. అయితే.. ఈ ఏరి వేతలు.. నిజమైన అనర్హులను ఏరేస్తే.. ఫర్వాలేదు. కానీ, దీనికి రాజకీయాలు ముసురుకున్నాయి. క్షేత్రస్తాయిలో తమ్ముళ్లు.. రెచ్చిపోతున్నారు. తమకు అనుకూలంగా లేని వారి కుటుంబాల్లో పించన్లను తొలగించేస్తున్నారు.
ఇది రాజకీయంగా ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. తాజాగా అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో లక్ష మందికిపైగా పింఛను దారులకు నోటీసులు ఇచ్చారు. దీంతో వారంతా.. ఇప్పుడు కూటమి సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. తాము రెండు దశాబ్దాలుగా పింఛన్లు తీసుకుంటున్నామని.. ఇప్పుడు ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దివ్యాంగులు కూడా.. గాబరా పడుతున్నారు. తమ పింఛన్లు తొలగించవద్దంటూ.. ఎమ్మెల్యే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇది చంద్రబాబుకు మైనస్‌గా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి.. పింఛన్ల జోలికి వెళ్లకపోవడమే మంచిదన్న సూచనలు వస్తున్నాయి.