ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ అధికారంలోకి రావడానికి ముందు వరకు సజ్జల పెద్దగా వార్తల్లో ఉండేవారు కాదు. పార్టీలో ఆయన ప్రాధాన్యం కూడా పెద్దగా కనిపించేది కాదు. కానీ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఆయన చాలా కీలకంగా మారిపోయారు. పేరుకు ప్రభుత్వ సలహాదారు అయినా.. కీలక మంత్రిత్వ శాఖల కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. ఆయనకు సకల శాఖా మంత్రి అనే పేరు కూడా వచ్చింది.
జగన్ ప్రభుత్వం ఘోర పరాజయానికి ముఖ్య కారణంగానూ ఆయన చెడ్డ పేరు తెచ్చుకున్నారు. వైసీపీ హయాంలో జరిగిన వైపల్యాలకు, దారుణాలకు బాధ్యుడిగా పేరు తెచ్చుకున్న సజ్జల.. ఇప్పుడూ కూటమి ప్రభుత్వం మీద అనేక నిందలు మోపుతూ.. తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. మూణ్నాలుగేళ్ల తర్వాత తాము కొట్టే దెబ్బ చాలా గట్టిగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల ఆరెస్టులు, కేసుల గురించి ఆయన మాట్లాడుతూ.. “ప్రభుత్వం ఎలా వేధింపులు చేయొచ్చో మా వాళ్లకు నేర్పిస్తున్నారు. అలాగే ఇప్పుడు అరాచకాలు చేస్తున్న వాళ్లందరూ ఎవరో, వాళ్లను ఏం చేయాలో మా వాళ్లు నోట్ చేసుకునేలా చేస్తున్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు ఎలా మంచి చేయాలి అని ఆలోచించాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీల వాళ్లను ఎలా వేధించాలన్న దాని మీదే దృష్టిపెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేసి ఉంటే మీ పరిస్థితి వేరేలా ఉండేది. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలలకే చంద్రబాబు అరెస్ట్ అయ్యేవారు. మేం ఆయన చేసిన అక్రమాలను పరిశోధించి నాలుగేళ్ల తర్వాతే ఆరెస్ట్ చేశాం. జగన్ గారు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న దాంతో 5 శాతం చేసి ఉన్నా ప్రతిపక్ష పార్టీల పరిస్థితి వేరుగా ఉండేది. మాది జగన్‌ను ప్రేమించే అభిమానులతో ఏర్పాటైన పార్టీ. మళ్లీ మూడేళ్లకో నాలుగేళ్లకో మాకు అధికారం వస్తుంది. అప్పుడు మేం కొట్టే దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది. తట్టుకోలేరు” అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
ఐతే ఏపీలో కక్ష పూరిత రాజకీయాలకు పునాది వేసిందే వైసీపీ అని.. ఇప్పుడు మాత్రం ఏమీ ఎరగనట్లు మాట్లాడుతున్నారని.. వైసీపీ హయాంలో ఐదేళ్లు ఏం జరిగిందో మరిచిపోయారా.. అంత చేశాక మళ్లీ అధికారం వస్తుందని కలలు కంటున్నారా అంటూ సోషల్ మీడియాలో సజ్జలకు కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ వ్యతిరేకులు.