రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిధుల సమీకరణకు కూడా.. ప్రాధాన్యం ఇచ్చారు. అప్పు రూపంలోనో.. మరో విధంగానో.. ఇప్పుడు అమరావతికి నిధులు అయితే వస్తున్నాయి. దీంతో జనవరి నుంచి పనులు కూడా పరుగులు పెట్టనున్నాయి. వచ్చే రెండున్నర లేదా.. మూడు సంవత్సరాల్లో అమరావతిని పరుగులు పెట్టించనున్నారు. టెండర్లను కూడా.. ఈ నెల ఆఖరులో ఖరారు చేయనున్నారు.
అయితే.. నిర్మాణాల సంగతి ఒకవైపు పరుగులు పెట్టిస్తూనే మరోవైపు.. రాజధానికి రుణం ఇస్తున్న ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకుల లక్ష్యాలను నెరవేర్చేందుకు కూడా సర్కారు నడుం బిగించింది. దీనిలో భాగంగానే వచ్చే మూడేళ్లలో ఇక్కడ పెద్ద ఎత్తున బ్రాండెడ్ కంపెనీలను తీసుకురావాల్సి ఉంది. వాటితో పెట్టుబడులు పెట్టించే ప్రయత్నం కూడా చేయాల్సి ఉంది. ఈ క్రమంలో సర్కారు ఇప్పుడు నిర్మాణంపైనే ఎంత సీరియస్‌గా దృష్టి పెట్టిందో .. అమరావతి ప్రమోషన్‌పైనా అంతే సీరియస్‌గా ఉంది.
2015-19 మధ్య సీఎం చంద్రబాబు అమరావతి బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఎక్కడ ఏకార్యక్రమం జరిగినా.. అమరావతిని ఆయన ప్రమోట్ చేశారు. నిజానికి అప్పట్లో అమరావతి ప్లాన్ కోసం.. దర్శకుడు రాజమౌళి వంటివారిని సంప్రదించడం వెనుక కూడా.. ప్రచార లోగుట్టు ఉంది. రాజమౌళి.. వస్తే.. జాతీయ మీడియా ప్రాధాన్యం ఇస్తుందన్న ఉద్దేశంతోనే ఆయనను రాజధానికి పిలిచి మరీ చర్చించారు. అలానే.. జాతీయ మీడియా కూడా కవరేజీ ఇచ్చింది. ఇది బాగా వర్కవుట్ అయింది.
ఇక, ఇప్పుడు.. ఇదే పంథాలో జాతీయ స్థాయిలోనే కాకుండా.. అంతర్జాతీయ స్థాయిలోనూ అమరావతికి బ్రాండు తీసుకువచ్చి.. ప్రమోషన్-ప్రచారం కోసం ప్రయత్నాలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 2027లో జాతీయ క్రీడలకు.. అమరావతిని వేదిక చేసుకోనున్నారు. కుదిరితే.. ఒలింపిక్స్(దీనిలో మూడు విభాగాలు ఉంటాయి. ఒకదానిని అమరావతిలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా 2027లోనే జరగనుంది) కూడా నిర్వహించనున్నారు.
అదేవిధంగా అంతర్జాతీయ మీడియాలో అమరావతిపై డాక్యుమెంటరీలు, ప్రచారం చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి నాయకులను ఆహ్వానించనున్నారు. ప్రధాని మోడీని పిలవనున్నారు. ఇక, జాతీయ మీడియాకు ఇక్కడ రాయితీలు ఇచ్చి.. ఇక్కడ నుంచి సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా కూడా ఆలోచన చేస్తున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. అమరావతి నిర్మాణమే కాదు.. ప్రమోషన్‌పైనా సీఎం చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్నది ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట.