రాష్ట్రంలో ఇప్పుడందరి చూపు రాష్ట్ర ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైనే ఉంది. మొన్నటి మార్చిలో అర్ధాంతరంగా వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఈసీ అభిప్రాయాన్ని అడిగింది. కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా అయితే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్రప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. కరోనా వైరస్ కారణంగా ఎన్నికల నిర్వహణ అసాధ్యమంటు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఏజీ చెప్పిన విషయంతో న్యాయస్ధానం ఏకీభవించలేదు. బీహార్లో ఎన్నికలు నిర్వహిస్తున్నపుడు ఏపిలో మాత్రం స్ధానిక సంస్ధల ఎన్నికలను ఎందుకు నిర్వహించలేరంటూ నిలదీసింది. కోర్టు ఏమి మాట్లాడినా ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రమే ఏజీ చెప్పగలరు. అయితే చివరకు కోర్టు స్పందిస్తు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎలక్షన్ కమీషన్ అని చెప్పి నోటీసులు జారీ చేసింది. అంటే హైకోర్టు ఇచ్చిన నోటీసులకు ఎన్నికల నిర్వహణపై ఈసీ ఏదో ఓ సమాధానం చెప్పాలి.
విషయానికి వస్తే కొంతకాలంగా ప్రభుత్వంతో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు ఏమాత్రం పడటం లేదు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కరోనా బూచిని చూపి నిమ్మగడ్డ ఎన్నికలను అర్ధాంతరంగా ఏకపక్షంగా వాయిదా వేశారు. దాని తర్వాత జరిగిన పరిణామాల కారణంగా ప్రభుత్వం, నిమ్మగడ్డ కు మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇపుడు ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని నిమ్మగడ్డ అంగీకరిస్తారా ? లేకపోతే ప్రభుత్వంతో విభేదిస్తారా ? అన్నది సస్పెన్సుగా మారింది. నిమ్మగడ్డ కూడా ప్రభుత్వంతో ఏకీభవిస్తే ప్లాబ్లమే లేదు. అదే విభేదించి ఎన్నికల నిర్వహణకు రెడీ అని అంటేనే సమస్య మళ్ళీ మొదలవుతుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల నిర్వహణపై సుప్రింకోర్టులో విచారణ జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భంగా మళ్ళీ ఎన్నికల నిర్వహణ విషయమై ప్రభుత్వంతో మాట్లాడనిదే ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు లేదంటూ నిమ్మగడ్డను సుప్రింకోర్టు గట్టిగా చెప్పింది. దాని ప్రకారమైతే ఎన్నికల నిర్వహణపై హైకోర్టు అడిగిన ప్రశ్నకు నిమ్మగడ్డ ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే సమాధానం ఇస్తారని అనుకుంటున్నారు.
నిజానికి ఎన్నికల వాయిదా వేసినపుడు రాష్ట్రం మొత్తం మీద కేవలం కొన్ని కరోనా కేసులు మాత్రమే నమోదైంది. కానీ ఇపుడు రోజుకు కొన్ని వేల కేసులు నమోదవుతున్నాయి. అప్పట్లో నిమ్మగడ్డ లాజిక్ ప్రకారం చూస్తే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. మరి ఏమి చేస్తారనే విషయంలోనే అందరి చూపులు ఇపుడు నిమ్మగడ్డ మీదున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates