18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన క‌మ్యూనిస్టు ఉద్య‌మ నాయ‌కుడు. కొంద‌రు ఆయ‌న మావోయిస్టుల‌తోనూ ప‌నిచేశార‌ని చెప్పుకొనేవారు. దీనిని ఆయ‌న కూడా దృవీక‌రించారు. అయితే.. వారి విధానాలు న‌చ్చ‌క‌.. తాను ప్ర‌జ‌ల కోసం బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో వెల్ల‌డించారు. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యం ఉన్న ప‌రిటాల ర‌వి సొంత నియోజ‌క‌వ‌ర్గం అనంత‌పురం జిల్లాలోని పెనుకొండ‌లో ఆయ‌న‌పై ప‌లు మార్లు హ‌త్యా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. హైద‌రాబాద్‌లో ఓ షూటింగ్‌లో ఉన్న స‌మ‌యంలోనూ ప‌రిటాల ల‌క్ష్యంగా కారు బాంబు పేలిన విష‌యం తెలిసిందే.

ఇక‌, 2005లో ప‌రిటాల దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. అప్ప‌ట్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాగా.. 18 ఏళ్ల త‌ర్వాత‌.. ఈ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు వ్య‌క్తుల‌కు తాజాగా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం. వీరిలో ఏ-3 నారాయ‌ణ రెడ్డి, ఏ-4 రేఖ‌మ‌య్య‌, ఏ-5 రంగ‌నాయ‌కులు, ఏ-6 వ‌డ్డే కొండ‌, ఏ-7 ఓబిరెడ్డిల‌కు తాజాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. వీరు అప్ప‌టి నుంచి జైల్లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. 2005 నుంచి కూడా కేసు విచార‌ణ ఆశించిన విధంగా ముందుకు సాగ‌క‌పోవ‌డం.. సుదీర్ఘ కాలం విచార‌ణ ఖైదీలుగా ఉండ‌డంతో హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం.

అప్ప‌ట్లో ఏం జ‌రిగింది?

2005, జనవరి 24న‌ అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల‌తో ప‌రిట‌ల ర‌వి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మానికి అనేకమంది సీనియ‌ర్ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. అంతేకాదు.. అప్ప‌టికే త‌న ప్రాణాల‌కు ముప్పు ఉందని గ్ర‌హించిన ర‌వి భారీ ఎత్తున సెక్యూరిటీని కూడా నియ‌మించుకున్నారు. పార్టీ ఆఫీసులోనే మధ్యహ్న భోజనం ముగించుకుని ఇంటికి బయలుదేరుదామని బ‌య‌ట‌కు వ‌చ్చిన ర‌విపై కొంద‌రు దుండ‌గులు బులెట్ ల వర్షం కురిపించారు. పకడ్బందిగా పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్న ర‌వి దారుణ హ‌త్య అప్ప‌ట్లో రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర అల‌జ‌డి రేపింది. అయితే.. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ కొన‌సాగుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.