రాజకీయాల్లో ఎక్కడ ఎలాంటి పాచిక వేస్తే పారుతుందో తెలియని నాయకులు ఉండరు. పైగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే చంద్రబాబుకు కొత్తగా రాజకీయ పాఠాలు ఎవరూ నేర్పాల్సిన అవసరం లేదు. అయినా ఆయన వేసే అడుగులు కొన్ని రాంగ్ పడ్డాయనే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తున్నాయి. గత ఏడాది ఎన్నికల్లో ఏదో ఊహించేసుకుని.. సీనియర్లు చెప్పినా కూడా మాట వినకుండా కొందరికి టికెట్‌లు ఇచ్చారు. వారంతా ఓడిపోయారు. ఇప్పుడు పార్లమెంటరీ జిల్లా పగ్గాల విషయంలోనూ ఇలాంటి తప్పులే దొర్లాయని అంటున్నారు సీనియర్లు. ఇలాంటి వాటిలో ముందున్న నియోజకవర్గం రాజమండ్రి.
రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా పగ్గాలను మాజీ మంత్రి ఎస్సీ నాయకుడు కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్‌కు అప్పగించారు చంద్రబాబు. కానీ, ఇక్కడ ఆయన విఫలమైన నాయకుడిగా స్థానిక నేతలు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. రెండు జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గంలో పార్టీని పరుగులు పెట్టించడం అంటే.. మాటలు కాదు. అయినా.. జవహర్ భుజాన వేసుకున్నారు. ఈయనకన్నా సీనియర్లు.. అటు తూర్పుగోదావరిలోను, ఇటు పశ్చిమ గోదావరిలోను ఉన్నారు. దీంతో వీరు ఇప్పుడు జవహర్ రాజకీయాలంటే.. మండిపడుతున్నారు. పైగా ఆయన వద్దని, మార్చాలని గళం వినిపించిన నాయకులే ఇప్పుడు ఆయనకు జై కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ పరిణామాలతో ఇక్కడి నాయకులు ఉడికి పోతున్నారు. సరే.. ఇదిలావుంటే, తాజాగా జవహర్ నియోజకవర్గంలో అడుగు పెట్టారు. రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇల్లే వేదికగా ఈ సమావేశం నిర్వహించారు. మరి జవహర్ ఇచ్చిన పిలుపుతో ఎంతమంది నాయకులు ఈ సమావేశానికి వచ్చారు? ఎవరెవరు ఆయనతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు? అంటే.. వేళ్ల మీద లెక్కించుకునే రేంజ్‌లోనేసాగింది. దాదాపు అరగంటకు పైగా నాయకుల రాకకోసం.. జవహర్ ఎదురు చూశారు. అయినప్పటికీ కీలకమైన నాయకులు ఎవరూ రాలేదు. దీంతో కార్యక్రమాన్ని మమ అనిపించి తప్పుకొన్నారు జవహర్.
ఈ సమవేశం తర్వాత జవహర్ నిరుత్తరులయ్యారనే వాదన వెలుగు చూసింది. అటు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కానీ.. ఇటు రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య కానీ.. జవహర్ సమావేశానికి రాలేదు. పైగా వారు పట్టనట్టు వ్యవహరించారు. దీంతో మున్ముందు తాను ఇక్కడ నెగ్గుకురాగలనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయిందట. మొత్తంగా చూస్తే.. జవహర్ మీటింగ్ అయితే పెట్టారు కానీ. నేతలను మాత్రం కదిలంచలేక పోయారనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. మరి ఏం చేస్తారో.. ఎలా ముందుకు వెళ్తారో చూడాలి అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates