సాయిరెడ్డి ‘ఫోన్ క‌హానీ’.. ఇంత కుట్ర ఉందా?

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి చుట్టూ మ‌రో కేసు ముసురుకుంది. ఆయ‌న కొన్నాళ్ల కిందట త‌న ఫోన్ పోయిందంటూ.. పెద్ద ఎత్తున యాగీ చేసిన విష‌యం గుర్తుండే ఉంటుంది. త‌న ఫోన్ పోయింద‌ని ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చారు. దీనిపై ఫిర్యాదు చేసిన‌ట్టు కూడా చెప్పారు. అయితే.. ఇప్పుడు అస‌లు ఈ ఫోన్ క‌హానీ వెనుక ఉన్నకుట్ర తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అస‌లు ఫోన్ పోయిన‌ట్టుగా పోలీసుల‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేద‌ని ఆర్టీఐ ద్వారా వెల్ల‌డైంది. దీంతో సాయిరెడ్డి ఫోన్ క‌హానీపై కొత్త కేసు న‌మోదు చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.

ఏం జ‌రిగింది?

2022, నవంబరు 22న త‌న ఫోన్ మిస్స‌యింద‌ని, దీనిలో విలువైన స‌మాచారం ఉంద‌ని.. సాయిరెడ్డి మీడియా ముందుకు వ‌చ్చి చెప్పారు. దీనిపై తాను గుంటూరు జిల్లా తాడేప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని.. వారు ప‌రిశోధ‌న చేస్తున్నార‌ని కూడా అప్ప‌ట్లో నే ఆయ‌న వెల్ల‌డించారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. రెండు కీల‌క కేసులు వెలుగు చూశాయి. 1) ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం. 2) విశాఖ భూముల వ్య‌వ‌హారం. ఈ రెండు కేసులు కూడా.. సాయిరెడ్డి వైపే ఎక్కువ‌గా అనుమానాలు వ్య‌క్తం చేశాయి.

ఇలాంటి కేసులు న‌మోదైన స‌మ‌యంలోనే సాయిరెడ్డి తెలివిగా.. త‌న ఫోన్ పోయింద‌ని చెప్పుకొచ్చారు. అయితే.. ఆ త‌ర్వాత అంతా సైలెంట్ అయిపోయింది. కానీ.. తాజాగా టీడీపీ నేత క‌న‌ప‌ర్తి శ్రీనివాస‌రావు.. దీనికి సంబంధించిన తీగ లాగారు. దీంతో వాస్త‌వాల డొంక క‌దిలింది. సాయిరెడ్డి త‌న ఫోన్ పోయింద‌ని కానీ.. పోలీసుల‌ను సంప్ర‌దించ‌డం కానీ.. జ‌ర‌గ‌లేద‌ని.. ఆర్టీఐ ద్వారా సేక‌రించిన స‌మాచారాన్ని క‌న‌ప‌ర్తి వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని తాడేప‌ల్లి పోలీసులే చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు కొత్త కేసు(చీటింగ్‌) న‌మోదుకురెడీ అయ్యారు.

ఏంటీ కేసులు..

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న సాయిరెడ్డి అల్లుడు.. శ‌ర‌త్‌చంద్రారెడ్డి ని ఈడీ అధికారులు విచారించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న దాదాపు 10 ఫోన్ల‌ను ధ్వంసం చేసిన‌ట్టు అధికారులు త‌మ రిపోర్టులో పేర్కొన్నారు. వీటిలో ఒక‌టి సాయిరెడ్డి ఫోన్ అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే.. చిత్రంగా ఈడీ అధికారులు పేర్కొన్న మ‌రుస‌టి రోజే సాయిరెడ్డి మీడియా ముందుకు వ‌చ్చి.. త‌న ఫోన్ పోయింద‌ని క‌థ‌ల‌ల్లారు. ఇప్పుడు అది నిజం కాద‌ని తెలిసింది.

ఇక‌, సాయిరెడ్డి ఉత్త‌రాంధ్ర వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న స‌మ‌యంలో విశాఖలో భూకుంభకోణాలు జ‌రిగాయ‌ని.. జ‌న‌సేన నాయ‌కుడు, కార్పొరేట‌ర్ పీతల మూర్తి యాద‌వ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచార‌ణలో ఉంది. అయితే.. దీనికి సంబంధించిన వివ‌రాలు కూడా.. ఆ ఫోన్‌లోనే ఉన్నాయి. మొత్తంగా.. త‌న ఫోన్ పోయింద‌ని చెప్ప‌డం ద్వారా.. సాయిరెడ్డి పెద్ద వ్యూహ‌మే ప‌న్నార‌న్న‌ది క‌న‌ప‌ర్తి మాట‌. దీనిపై ఈడీ అధికారుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని శ్రీనివాస‌రావు చెప్ప‌డం గ‌మ‌నార్హం.