సాధారణంగా పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య అనేక రాజకీయ పరమైన విధానపరమైన అంశాల చుట్టూ రాజకీయా లు సాగుతాయి. ఇక, అంశాలు కూడా చొచ్చుకుని వస్తాయి. వాటిపై చర్చకు పట్టుబట్టడం.. విపక్షాలు సహజంగా చేసే పనే. ఈ క్రమంలోనే గత పది రోజులుగా పార్లమెంటు ఉభయ సభలు కూడా స్తంభించాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీపై అమెరికాలో నమోదైన కేసుల విషయంపై ఇక్కడ జాయింట్ పార్లమెంటరీ కమిటీని(జేపీసీ) వేయాలంటూ.. పెద్ద ఎత్తున ప్రతిపక్షం ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కానీ, దీనికి అధికార పక్షం అడ్డు పడుతోంది. ఈ క్రమంలోనే లోక్‌సభ, రాజ్యసభల్లో అల్లరి, వాదనలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇంతలో రాజ్యసభలో మరో మంట చెలరేగింది. తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ సీనియర్ నేత.. రేణుకా చౌదరి సంచలన నోటీసును రాజ్యసభకు ఇచ్చారు. దానిపై చర్చకు పట్టుబట్టారు. అనంతరం.. చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. కానీ, చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఈ నోటీసును తిరస్కరించారు. అంతేకాదు.. “మీకు మతి లేదు.. రాజ్యాంగంపై పట్టు కూడా లేదు. రూల్స్ తెలియవు.. నోరు మాత్రమే తెరుస్తారు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజ్యసభలో గురువారం ఏర్పడిన రాజకీయ మంటలు శుక్రవారం భోగి మంటలను తలపించేలా ఆకాశానికి ఎగిసి పడ్డాయి. ఈ విషయంలో అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్షం కూడా.. ఒకరినొకరు నిందించుకుంటున్నారు.
రేణుకా చౌదరి నోటీసు ఏంటి?
అలహాబాద్ హైకోర్టులో ఉన్న ఓ న్యాయమూర్తి జస్టిస్ శేఖర్‌కుమార్ యాదవ్.. ఈ నెల 3న జరిగిన ఓ కార్యక్రమంలో(హైకోర్టులో నే) నోరు చేసురుకున్నారనేది రేణాకా చౌదరి ఆరోపణ. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలను, ఆడియో, వీడియో రికార్డులను కూడా ఆమె సభకు తీసుకువచ్చారు.”మైనారిటీ ముస్లింలు.. ముఖ్యంగా కఠ్మాండాలు.. ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమని, హిందువులు ఇప్పటికైనా తెలుసుకోవాలని. వారి మతాన్ని వారు కాపాడుకునేందుకు వీధుల్లోకి రావాలని. అప్పుడే హిందూ మతం మనుగడ ఉంటుందని.. అంతేకాదు.. ఇప్పుడు కనుక హిందువులు మేల్కోకపోతే.. త్వరలోనే భారత్ కూడా.. బంగ్లాదేశ్ లాగా మారిపోతుందని, తాలిబాన్ రాజ్యం వచ్చేస్తుందని.. న్యాయమూర్తి స్థానంలో ఉన్న వ్యక్తి అన్నారు” అని రేణుకా చౌదరి చెబుతున్నారు.
అంతేకాదు.. జస్టిస్ శేఖర్ యాదవ్‌కు.. రాజ్యాంగం అంటే లెక్కలేదని, మహిళలను కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నా రని.. అలాంటి న్యాయమూర్తిని తక్షణం పదవీచ్యుతుడిని చేసేలా చర్చించి.. నిర్ణయం తీసుకోవాలన్నది రేణుకా చౌదరి డిమాండ్. అయితే.. ఈ నోటీసును చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ బుట్టదాఖలు చేయడంతోపాటు.. రేణుకపై నోరు చేసుకున్నారు. మతిలేని నోటీసు.. రూల్స్ తెలుసా? అంటూ.. వాటిని చదివి వినిపించారు. ఇది..ఇప్పుడు రాజ్యసభలో రాజకీయాలను మరింత కాక పుట్టించింది. తాజాగా 55 మంది కాంగ్రెస్ సహా ఇతర పార్టీల సభ్యులు అటు న్యాయమూర్తిని, ఇటు చైర్మన్‌ను కూడా అభిశంసించాలని పట్టుబడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.