వైసీపీ నేత, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులలోని వేముల మండలంలో వైసీపీ కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అవినాష్ రెడ్డి పోలీసులు ముందు జాగ్రత్తగా గృహ నిర్బంధం చేసినట్టు సీఐ నరసింహులు తెలిపారు.
ఏం జరిగింది?
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికల విషయంపై మాట్లాడేందుకు తాహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డగించారు. అయితే.. తమ ఎంపీని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ.. వైసీపీ నాయకులు ప్రశ్నించారు.
ఈ క్రమంలో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని.. వైసీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘర్షణ పెరిగే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు అవినాష్ రెడ్డిని అక్కడ నుంచి తరలించారు. ఆ వెంటనే పులివెందులలో ని జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనను నిర్బంధించారు. దీనికి ప్రతిగా వైసీపీ నాయకులు కూడా రంగంలోకి దిగి.. క్యాంపుకార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమ నేతను తక్షణమే విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.
అధికార పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు కక్ష సాధిపునకు దిగుతున్నారని వారు ఆరోపించారు. ఏం జరిగిందని తమ నేతను గృహ నిర్బంధం చేశారని వారు ప్రశ్నించారు. అయితే.. చట్ట ప్రకారమే తాము వ్యవహరించామని.. కక్ష పూరితంగా వ్యవహరించలేదని సీఐ నరసింహులు తెలిపారు.