ఏ ఎమ్మెల్యే అయినా.. అంతిమ లక్ష్యం అసెంబ్లీలో ప్రసంగించడమే. పార్టీ ఏదైనా.. గెలిచిన తర్వాత.. ఎమ్మెల్యే సభలో ఉండాలని పార్టీ అధినేతలు కోరుకుంటారు. ఇక, నియోజకవర్గం ప్రజలు కూడా ఆశిస్తారు. కానీ, చిత్రంగా బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి అసెంబ్లీకి వచ్చారు. తర్వాత.. ఆయన కనిపించడం లేదనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు. ఆయన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి.
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయవాడ పశ్చిమస్థానం నుంచి బీజేపీ టికెట్‌పై విజయం దక్కించుకున్నా రు సుజనా చౌదరి.వాస్తవానికి ఇక్కడ బీజేపీ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, అనూహ్యంగా ఆయన టీడీపీ మద్దతును కూడగట్టుకుని.. ముందుకు సాగారు. దీంతో విజయం సాధ్యమైంది. పైగా.. వైసీపీ కూడా ఇక్కడ పేలవమైన అభ్యర్థినే రంగంలోకి దింపడం సుజనాకు కలిసివచ్చింది. తర్వాత.. కొన్ని రోజులు ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట చిన్నపాటి పనులు చేయించారు.
అయితే.. అసలు ఎమ్మెల్యే అయిన వ్యక్తి.. సభలో ఉండాలని కోరుకుంటారు. కానీ, చిత్రంగా సుజనా ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి అది కూడా.. ప్రమాణ స్వీకారం రోజున మాత్రమే సభకు హాజరయ్యారు. ఇక, ఆ తర్వాత.. ఆయన ఢిల్లీలోను, హైదరాబాద్, బెంగుళ్లూరుల్లోనూ కాలక్షేపం చేస్తున్నారు. ఇటీవల.. నియోజకవర్గంలో సుజనా క్యాంటీన్ల పేరుతో ప్రత్యేకంగా క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు హరో కృష్ణ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ఒక్కటే ఆశించిదగిన పరిణామం.
అయితే.. సుజనా వ్యవహారంపై.. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానికంగా ఉండని నాయకులను ఎన్నుకున్నారని.. ఇప్పుడు మీ బాధలు వినేందుకు నేను తప్ప..ఎవరూ లేరని ఆయన చెబుతున్నారు. దీంతో సుజనా వ్యవహారం చర్చకు వస్తోంది. టీ కొట్లు.. నాలుగు రోడ్ల సెంటర్లలో కూడా ఇప్పుడు సుజనాకు సంబంధించిన చర్చ జోరుగానే సాగుతోంది. వాస్తవానికి హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కూడా.. సేమ్ టు సేమ్. అయినా..అక్కడ మేనేజ్ చేసేందుకు టీడీపీ నాయకులు ఉన్నారు. కానీ, పశ్చిమలో ఈ తరహా పరిస్థితి లేకపోవడంతో సుజనా ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు.